Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ మేనిఫెస్టోలో అందరికీ ఉచిత వైద్యం, బీమా కవరేజీ.. !

Telangana  BJP Manifesto: నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియడంతో ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం కావడంతో ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా,  కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్య నేతలను ప్రచారానికి రప్పించి తెలంగాణ బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది.
 

Free Health And Insurance Coverage To All In Telangana  BJP Manifesto Likely RMA
Author
First Published Nov 14, 2023, 3:11 AM IST

Telangana Assembly Elections 2023: నవంబర్ 17న బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుద‌ల చేయ‌నున్నార‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోలో ఓటర్లకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, బీమా క‌వ‌రేజీ వంటి హామీలు ఉండ‌నున్నాయ‌ని స‌మాచారం. ఓటర్లకు ఉచిత విద్య, ఆయుష్మాన్ భారత్ కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం, ప్రతి ఒక్కరికీ జీవిత బీమా, రైతుల నుంచి క్వింటాలుకు రూ.3100 చొప్పున ధాన్యం కొనుగోలు, వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ.20 వేలు, ప్ర‌తి మ‌హిళ‌కు ఏడాదికి 12 వేల రూపాయ‌ల సాయం, రూ.500 సిలిండ‌ర్ అందించ‌డం వంటి హామీలు ఇవ్వ‌నున్న‌ట్టు స‌మాచారం. అలాగే, తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, రాష్ట్రవ్యాప్తంగా జాన‌ ఔషధి కేంద్రాలు, యూపీఎస్సీ తరహాలో టీఎస్ పీఎస్సీ పరీక్షలకు జాబ్ క్యాలెండర్, మతపరమైన పర్యాటకాన్ని పెంచుతామని బీజేపీ మేనిఫెస్టోలో హామీ ఇవ్వ‌నుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు తెలిపాయి.

అలాగే, రాష్ట్రంలో ఐఐటీ, ఎయిమ్స్ త‌ర‌హాలో విద్యాసంస్థల స్థాపన , ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు క‌ట్టివ్వ‌డం వంటివి కూడా ఉన్నాయ‌ని స‌మాచారం. దీంతో పాటు రజకులు, నాయీబ్రాహ్మణులు, వడ్రంగులు, విశ్వబ్రాహ్మణులు, చేతివృత్తులవారు, చిరు వ్యాపారులకు కోసం ప్రత్యేక పథకం, ఫీజుల నియంత్రణకు చర్యలు, మహిళా సంఘాలు, రైతులకు వడ్డీలేని రుణాలు అందించ‌డం వంటివి కూడా తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోలో ఉండున్నాయ‌ని తెలిసింది.

బీజేపీ ముమ్మ‌ర ప్ర‌చార ర్యాలీలు.. 

నవంబర్ 17న తెలంగాణ పర్యటన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారని నవంబర్ 13 సోమవారం నాడు బీజేపీ ప్రకటించింది. మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం నల్గొండ, వరంగల్‌, గద్వాల్‌, రాజేంద్రనగర్‌లలో జరిగే ఎన్నికల ర్యాలీల్లో షా పాల్గొంటారు. నామినేషన్ పత్రాల దాఖలు ప్రక్రియ ముగియడంతో ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం కావడంతో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్య నేతలను ఎన్నికల ప్రచారానికి దింపుతూ తెలంగాణ‌ బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఆదివారం సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన పరేడ్‌ గ్రౌండ్‌ సమావేశాన్ని విజయవంతంగా ముగించిన నేపథ్యంలో దళితులకు షెడ్యూల్డ్‌ కులాల (ఎస్‌సీ) ఉపవర్గీకరణను శాశ్వతంగా పరిష్కరిస్తామంటూ ఓ కమిటీని ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు ప్ర‌ధాని మోడీ ప్ర‌క‌టించారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఈ నెల‌లోనే ప్రధాని మోడీ మళ్లీ తెలంగాణలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు.

నవంబర్ 25న కరీంనగర్‌లో బహిరంగ సభ, మరుసటి రోజు నిర్మల్‌లో జరిగే మరో సభలో మోడీ ప్రసంగిస్తారు. నవంబర్ 27న హైదరాబాద్‌లో జరిగే రోడ్‌షోలో ఆయన పాల్గొంటారు. పరేడ్‌ గ్రౌండ్‌ సమావేశంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లను దళిత వ్యతిరేకి అని మోదీ అభివర్ణించగా, ఎల్‌బీ స్టేడియంలో జరిగిన సమావేశంలో బీసీ వర్గాలను నిర్లక్ష్యం చేస్తున్నందుకు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమాజిగూడలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విలేకరుల సమావేశంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి ఎస్సీ సబ్‌ కేటగిరీ సమస్యను పరిష్కరించడంలో కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర జాప్యం చేసింద‌ని ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios