Asianet News TeluguAsianet News Telugu

యుపి మహిళపై నాలుగోసారి యాసిడ్ దాడి చేశారు

ఆమె సాధారణ మహిళ. పెళ్లి అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమెపై ఒకసారి అత్యాచారం చేశారు. అది చాలక ఇప్పటి వరకు నాలుగుసార్లు యాసిడ్ దాడి చేశారు. ఈ అమానవీయ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. మానవత్వానికి మచ్చ తెచ్చే ఈ ఘటన మహిళా లోకాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. 

fourth time acid attack on uttara pradesh lady

ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లక్నో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. 9 ఏళ్ల క్రితం అత్యాచారానికి గురై కుమిలిపోతున్న ఓ వివాహితపై దుండగులు నాలుగో సారి కూడా యాసిడ్‌ దాడి చేశారు. యుపిలోని రాయ్‌బరేలిలోని ఓ గ్రామానికి చెందిన 31 ఏళ్ల వివాహితకి ఇద్దరు పిల్లలు. 2008లో ఆమె తన స్వగ్రామంలో ఉన్నప్పుడు ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత 2011లో ఆమెపై యాసిడ్‌ దాడి జరిగింది. ఈ ఘటన నుంచి తేరుకోకుండానే 2013లో మరోసారి యాసిడ్‌ దాడి జరిగింది.

అప్పటినుంచి ఆమె అలిగంజ్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ యాసిడ్‌ దాడి బాధితుల కోసం ఏర్పాటు చేసిన కేఫ్‌లో పనిచేస్తోంది. 2017 మార్చి నెలలో ఆమె రైలులో లక్నో వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి మళ్లీ యాసిడ్‌ దాడి చేశారు. అప్పుడు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దాస్ ఆమెను హాస్పిటల్‌లో పరామర్శించి పరిహారం చెల్లించారు. యాసిడ్‌ దాడికి పాల్పడినవారిని అరెస్ట్‌ చేశారు.

 

తన జీవితంలో ఇన్ని దారుణ ఘటనలు చోటుచేసుకున్నా ఆత్మస్థైర్యం కోల్పోకుండా తన బతుకేదో తాను బతుకుంటే తాజాగా నాలుగోసారి ఆమెపై యాసిడ్‌ దాడి జరిగింది. శనివారం రాత్రి 8 గంటల సమయంలో నీళ్లు పట్టుకోవడానికి ఆమె బయటికి వచ్చినప్పుడు కొందరు వ్యక్తులు బైక్‌పై వచ్చి యాసిడ్‌ పోసి పరారయ్యారు.

 

ఈ ఘటనలో కుడి వైపు ముఖం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై లక్నో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సదరు మహిళపై గతంలో అత్యాచారం చేసిన నిందితులే ఇప్పుడు కూడా ఆమెపై యాసిడ్‌ దాడులకు పాల్పడుతున్నారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. యుపిలో బిజెపి పాలన షురూ అయినా అరాచకాలు, అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios