Asianet News TeluguAsianet News Telugu

పీఎఫ్‌ఐ కేసు.. చంచల్‌గూడ జైలు నుంచి నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకున్న ఎన్‌ఐఏ

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో ఉన్న నలుగురు నిందితులను ఎన్‌ఐఏ కస్టడీలోకి తీసుకుంది. 

Four PFI members Take into custody by NIA From chanchalguda jail
Author
First Published Sep 28, 2022, 12:32 PM IST

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో ఉన్న నలుగురు నిందితులను ఎన్‌ఐఏ కస్టడీలోకి తీసుకుంది. ఎన్‌ఐఏ కస్టడీకి తీసుకున్నవారిలో రెహమాన్, వహీద్, జాఫరుల్లా వారీస్‌లు ఉన్నారు. ఎన్‌ఐఏ కార్యాలయంలో నలుగురు నిందితులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. మూడు రోజుల పాటు ఎన్‌ఐఏ అధికారులు వీరిని ప్రశ్నించనున్నారు. 

అంతకుమందు నిందితులను 30 రోజుల కస్టడీకి అనుమతించాలని కోర్టులో ఎన్‌ఐఏ పిటిషన్ దాఖలు చేసింది. అరెస్టయిన పీఎఫ్‌ఐ సభ్యులు ఫిజికల్ ఎఫిషియన్సీ ముసుగులో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, మత విద్వేషాన్ని పెంచుతున్నారని ఎన్‌ఐఏ న్యాయవాది తన పిటిషన్‌లో కోర్టుకు తెలిపారు. సోదాల సమయంలో స్వాధీనం చేసుకున్న పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, డిజిటల్ పరికరాలను ఫోరెన్సికల్‌గా పరిశీలించాల్సి ఉందన్నారు. అక్రమ నగదు జాడను ట్రాక్ చేయడానికి బ్యాంక్ ఖాతాలను ధృవీకరించాలని పేర్కొన్నారు. అయితే ఎన్‌ఐఏ కోర్టు మాత్రం నిందితులను మూడు రోజుల కస్టడీకి అనుమతించింది. 

ఇక, ఇటీవల ఎన్‌ఐఏ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లతో తెలంగాణ, ఏపీలలోని పీఎఫ్‌ఐ, దాని అనుబంధ సంస్థల కార్యాలయాలపై సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో..  కరీంనర్, నిజామాబాద్, హైదరాబాద్, నెల్లూరు కర్నూలులో సోదాలు చేపట్టిన ఎన్‌ఐఏ అధికారులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. చంద్రాయణగుట్టలోని పీఎఫ్‌ఐ  కార్యాలయాన్ని కూడా అధికారులు సీజ్ చేశారు. ఆ కార్యాలయం నుంచి హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం. 

ఇదిలా ఉంటే.. పీఎఫ్‌ఐ ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చుతున్నదనే ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థపై కేంద్ర హోం శాఖ 5 ఏళ్ల పాటు నిషేధం విధించింది. పీఎఫ్‌ఐతోపాటు దాని అనుబంధ సంస్థలను కూడా నిషేధం విధించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) కింద ఈ చర్య చేపట్టినట్టుగా కేంద్రం తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios