పండగపూట ఎంతటి ఘోరం... రోడ్డు ప్రమాదంలో తండ్రీ బిడ్డలు, తల్లి దుర్మరణం
సంక్రాంతి పండగపూట సంతోషాలు నిండాల్సిన ఇంట్లో చావుబాజా మోగింది. దైవదర్శనానికి వెళ్లివస్తున్న ఓ కుటుంబం రోడ్డుప్రమాదానికి బలయ్యింది.
మహబూబాబాద్ : దైవదర్శనానికి వెళ్ళివస్తుండగా ఘోరం జరిగింది. ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... గూడూరు మండలం చిన్న ఎల్లాపూర్ గ్రామ సమీపంలోని ఆముతండాకు చెందిన ఇస్లావత్ శ్రీను ఇద్దరు బిడ్డలు రుత్విక్(6), రుత్విక(4)తో పాటు తల్లి(70), వదిన శాంతి లతో కలిసి గత శనివారం దైవదర్శనానికి వెళ్లాడు. సూర్యాపేట జిల్లా మిర్యాలపేటలోని గిరిజన ఆలయానికి వెళ్ళిన వీళ్లు దైవదర్శనం చేసుకుని మొక్కు చెల్లించుకున్నారు. రోజంతా దైవ సన్నిధిలోనే గడిపి ఆదివారం సాయంత్రం ఆటోలో తిరుగుపయనం అయ్యారు.
అయితే ఆనందంగా సాగుతున్న వీరి ప్రయాణంలో ఒక్కసారిగా విషాదం నిండిపోయింది. మరికొద్దిసేపట్లో ఇంటికి చేరుకుంటారనగా ఓ కారు రూపంలో మృత్యువు కబళించింది. జమాండ్లపల్లి శివారులో జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారు శ్రీను కుటుంబం ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో శ్రీను, ఇద్దరు చిన్నారులు, తల్లి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వదిన శాంతి, ఆటో, కారు డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు.
Also Read విషాదం.. మాంజా దారం మెడకు చుట్టుకుని ఆర్మీ జవాను మృతి
ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ముందుగా గాయపడిన వాహనాల డ్రైవర్లు, శాంతిని సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. అనంతరం ఘటనాస్థలంలో చెల్లచెదురుగా పడివున్న మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఇలా రోడ్డు ప్రమాదం సంక్రాంతి పండగపూట ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. శ్రీను కుటుంబం మృతివార్త తెలిసి పండగపూట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నారు. కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.