హైదరాబాద్ లో ఇవాళ ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బిభత్సం సృష్టించింది. సిగ్నల్ వద్ద ఆగివున్న వాహనాలపైకి బస్సు దూసుకెళ్లడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

హైదరాబాద్ : ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగివున్న వాహనాలపైకి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దూసుకెళ్లిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడగా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఉదయం వాహనాల రద్దీ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. 

ధనుంజయ్ ట్రావెల్స్ కు చెందిన బస్సు హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం హైదరాబాద్ రోడ్లపైకి వచ్చిన ఈ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. ఎర్రగడ్డ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కూడా బస్సు ఆగకుండా ముందుకు దూసుకెళ్లడానికి ప్రయత్నించడంతో ప్రమాదం జరిగింది. రెడ్ సిగ్నల్ పడటంతో ముందున్న కార్లు ఆగగా ట్రావెల్స్ బస్సు మాత్రం అదేవేగంతో సిగ్నల్ వైపు దూసుకెళ్లింది. దీంతో అదుపుతప్పిన బస్సు రెండు కార్లను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సుతో పాటు రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ఈ మూడు వాహనాలు రోడ్డుకు అడ్డంగా ఆగిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించే ఏర్పాట్లుచేసి అనంతరం ట్రాఫిక్ ను క్లియర్ చేసారు. 

Read More విషాదాంతంగా పెళ్లి షాపింగ్... కరీంనగర్ లో కారు బోల్తాపడి మహిళ మృతి

ప్రమాదానికి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే బస్సును సీజ్ చేసిన పోలీసులు పరారీలో వున్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. గాయపడిన వారి ప్రాణాలకేమీ ప్రమాదం లేదని తెలిపారు.