కొత్తూరులో మాజీ జర్నలిస్ట్ కరుణాకర్ రెడ్డి హత్య కేసు: నలుగురు అరెస్ట్
రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మండంలో మాజీ జర్నలిస్ట్ కరుణాకర్ రెడ్డిని కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కొత్తూరు లో మాజీ జర్నలిస్టు కరుణాకర్ రెడ్డి హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు సోమవారంనాడు అరెస్ట్ చేశారు. కొత్తూరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద కరుణాకర్ రెడ్డి డాక్యుమెంట్ రైటర్ గా పనిచేస్తున్నాడు. కరుణాకర్ రెడ్డి స్వగ్రామం కొత్తూరు మండలం మల్లాపూర్.తన బంధువు శ్రీధర్ రెడ్డి తో కలిసి చేగూరు నుండి తిమ్మాపూర్ వైపునకు కరుణాకర్ రెడ్డి కారులో వెళ్తున్న సమయంలో నలుగురు దుండగులు కరుణాకర్ రెడ్డిని ఆదివారంనాడు కిడ్నాప్ చేశారు. తీవ్రంగా కొట్టడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిన కరుణాకర్ రెడ్డిని నిందితులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కరుణాకర్ రెడ్డి మృతి చెందాడు.
కరుణాకర్ రెడ్డి హత్య కేసులో విక్రమ్ రెడ్డి , విష్ణువర్ధన్ రెడ్డి, అరుణ్ రెడ్డి, అరూఫ్ లను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వైపు కరుణాకర్ రెడ్డి హత్యకు ఎంపీపీ మధుసూధన్ రెడ్డి ప్రధాన కారణమని కరుణాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎంపీపీ మధుసూధన్ రెడ్డిపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని గ్రామస్థులు ఇవాళ ఆందోళనకు దిగారు.
కరుణాకర్ రెడ్డి గతంలో మధుసూధన్ రెడ్డి అనుచరుడిగా ఉన్నాడు. వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో మధుసూధన్ రెడ్డితో కరుణాకర్ రెడ్డి దూరంగా ఉంటున్నారు. అయితే ఓ భూమి విషయంలో వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయి. నిన్న కూడ గ్రామంలో మధుసూధన్ రెడ్డి , కరుణాకర్ రెడ్డి మధ్య గొడవ జరిగింది. పెద్ద మనుషులు కూడా వచ్చారు. అయితే కరుణాకర్ రెడ్డిని అంతు చూస్తానని మధుసూధన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపస్తున్నారు. పంచాయితీకి వచ్చిన పెద్ద మనుషులను కూడా ఎంపీపీ బెదిరించినట్టుగా మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కరుణాకర్ రెడ్డి కిడ్నాప్ విషయమై ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు సకాలంలో పట్టించుకోలేదని కరుణాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.