ఖమ్మం: అధికారం కోసం కొందరు స్వార్ధపరులు  ఓడించారని మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. 2020 సంవత్సరం కలిసి రాలేదన్నారు.  స్వార్ధం కోసం కొందరు తనను ఓడించినా... కేసీఆర్ కు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.

రాజకీయాల్లో ఆటుపోట్లు, గెలుపోటములుంటాయని ఆయన చెప్పారు. రాజకీయాలు కొనసాగిస్తూ అభివృద్దికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.

2018 అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పాలేరు నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో ఆయన ఖమ్మం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఆయన  ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొంత కాలానికి ఆయన  టీడీపీని నీడి టీఆర్ఎస్ లో చేరారు.

కేసీఆర్ మంత్రివర్గంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి గా పనిచేశారు. పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణంతో జరిగిన పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో ఇదే స్థానం నుండి ఆయన ఓటమి పాలయ్యారు.

కాంగ్రెస్ అభ్యర్ధి కందాళ ఉపేందర్ రెడ్డి ఈ స్థానం నుండి విజయం సాధించారు. ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరారు. ఈ నియోజకవర్గంలో తుమ్మల నాగేశ్వర్ రావు వర్గానికి కందాల ఉపేందర్ రెడ్డి వర్గానికి పొసగడం లేదు.