Asianet News TeluguAsianet News Telugu

పవన్‌తో మధ్యాహ్నం భేటీ: జనసేనలోకి మోత్కుపల్లి

మాజీ మంత్రి, టీడీపీ బహిష్కృత నేత  మోత్కుపల్లి నర్సింహులు  త్వరలో జనసేనలో చేరనున్నారు.  ఈ ఏడాది మే మాసంలో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడుపై వ్యక్తిగత విమర్శలు చేసినందుకు నర్సింహులును పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది.
 

Former minister Mothkupalli Narasimhulu may join in Janasena

మాజీ మంత్రి, టీడీపీ బహిష్కృత నేత  మోత్కుపల్లి నర్సింహులు  త్వరలో జనసేనలో చేరనున్నారు.  ఈ ఏడాది మే మాసంలో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడుపై వ్యక్తిగత విమర్శలు చేసినందుకు నర్సింహులును పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది.


1983లో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన సమయంలో  మోత్కుపల్లి నర్సింహులు టీడీపీలో చేరారు.  ఉమ్మడి నల్గొండ జిల్లా ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి  ఆయన పలు దఫాలు టీడీపీ, స్వతంత్ర, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఆయన  విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు.

1995లో టీడీపీ సంక్షోభ సమయంలో మోత్కుపల్లి నర్సింహులు ఎన్టీఆర్ వైపు నిలిచారు.  ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2001 తర్వాత  అప్పటి పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలో చేరారు. అప్పటి నుండి ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నారు.

ఈ ఏడాది మే మాసంలో  చంద్రబాబునాయుడుపై విమర్శలు చేశారు. అంతేకాదు ఈ ఏడాది జనవరి మాసంలో  టీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.  ఈ కారణాలతో  మోత్కుపల్లి నర్సిహులును పార్టీ నుండి బహిష్కరించింది టీడీపీ నాయకత్వం.

అయితే పార్టీ నుండి బహిష్కరణకు గురైన తర్వాత మోత్కుపల్లి నర్సింహులు చంద్రబాబునాయుడుపై విమర్శల  తీవ్రతను మరింత పెంచారు. ఈ క్రమంలోనే తిరుపతికి వెళ్లి చంద్రబాబునాయుడు ఓటమి పాలు కావాలని కూడ  వెంకటేశ్వరస్వామి వారిని కోరుకొన్నారు.


టీఆర్ఎస్‌లో మోత్కుపల్లి నర్సింహులు చేరుతారని కూడ కొంతకాలంగా ప్రచారం సాగుతోంది.  అయితే కానీ,టీఆర్ఎస్‌లో ఆయన చేరలేదు. గురువారం నాడు మధ్యాహ్నం జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్‌తో మోత్కుపల్లి నర్సింహులు సమావేశం కానున్నారు. 

నర్సింహులు జనసేనలో చేరుతారనే  ఆయన సన్నిహితులు చెబుతున్నారు.  తెలంగాణ జనసేన చీఫ్‌గా నరసింహులును నియమించే అవకాశాలు కూడ లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.తెలంగాణలో కూడ జనసేనకు  బలమైన నాయకుడు అవసరం ఉన్నారు. 

ఈ తరుణంలో మోత్కుపల్లి నరసింహులు లాంటి నాయకుడు జనసేనలో చేరితే పార్టీకి అదనపు ప్రయోజనం కలిగే అవకాశం ఉందని  పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

2009 ఎన్నికల సమయంలో  ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్ జనరల్ కావడంతో తుంగతుర్తి సెగ్మెంట్ నుండి నరసింహులు టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.  2012 తర్వాత రాజ్యసభ టిక్కెట్టు కేటాయించాలని చంద్రబాబును మోత్కుపల్లి కోరారు. 

కానీ, రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మోత్కుపల్లికి రాజ్యసభ టిక్కెట్టు దక్కలేదు. ఆ తర్వాత గవర్నర్ పదవిని ఇప్పిస్తానని  బాబు ఆ సమయంలో హామీ ఇచ్చారు. ఎన్డీఏలో టీడీపీ గతంలో భాగస్వామిగా ఉన్న కాలంలో  గవర్నర్ పదవి విషయమై చంద్రబాబునాయుడు కోరినా కూడ బీజేపీ నాయకత్వం  నరసింహులుకు ఆ పదవిని కట్టబెట్టలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అయిన తర్వాత కూడ నరసింహులుకు గవర్నర్ పదవి దక్కుతోందని వెంకయ్యే స్వయంగా  చెప్పారని టీడీపీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. అయితే  ఆ తర్వాత గవర్నర్ పదవి దక్కలేదు. టీడీపీనిని టీఆర్ఎస్‌లో విలీనం చేయాలని నర్సింహులు కోరారు. ఈ డిమాండ్ పట్ల టీడీపీ శ్రేణుల్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. నర్సింహులుపై చర్య తీసుకోవాలని కోరారు. 

ఈ ఏడాది జనవరి 18వ తేదీన  ఎన్టీఆర్ ఘాట్ వద్ద నరసింహులు ఈ డిమాండ్ చేశారు. అప్పటి నుండి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.మరో వైపు ఈ వ్యాఖ్యలు చేసినందుకు ఆయన పార్టీకి క్షమాపణలు చెప్పారు.  ఆ తర్వాత ఈ ఏడాది మే 28 న  ఎన్టీఆర్ ఘాట్ వద్దే  చంద్రబాబుపై  నరసింహులు విమర్శలకు దిగాడు. అదే రోజు రాత్రి  నర్సింహులును పార్టీ నుండి బహిష్కరించారు.

అప్పటి నుండి బాబుకు వ్యతిరేకంగా నర్సింహులు గళమెత్తుతున్నారు.తాజాగా ఆయన జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకొన్నట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు.. మధ్యాహ్నం పవన్‌కళ్యాణ్‌తో సమావేశం తర్వాత ఈ విషయమై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 


మాదాపూర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో  మోత్కుపల్లి నర్సింహులు మధ్యాహ్నం 3 గంటలకు జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్‌తో సమావేశం కానున్నారు.  గత నెల  మాసం నుండి  మోత్కుపల్లి నర్సింహులు  జనసేన నేతలతో టచ్‌లో ఉన్నారని సమాచారం.

దళిత సామాజిక వర్గానికి చెందిన మోత్కుపల్లి నర్సింహులును పార్టీలోకి తీసుకోవచడం ద్వారా పార్టీకి ప్రయోజనం  ఉంటుందని జనసేన  వర్గాలు అభిప్రాయంతో ఉన్నాయి.  ఈ భేటీ తర్వాత మోత్కుపల్లి నర్సింహులు ఏం చెబుతారనే విషయమై అనేది ఆసక్తి నెలకొంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios