హైదరాబాద్: తనను ప్రాణాలతోనే బొందపెట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారని  మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం నాడు షామీర్ పేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసమే తాను అవమానాలను భరించినట్టుగా చెప్పారు.  బానిస కంటే అధ్వాన్నంగా ఉన్న మంత్రి పదవి ఎందుకు అని తాను భావించానన్నారు. అది ప్రగతి భవన్ కాదు బానిస భవన్ అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ మంత్రైనా స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ఉందా అని ఆయన ప్రశ్నించారు. అధికారులకు కూడ స్వేచ్ఛ లేదన్నారు.

also read:నాకే కాదు హరీష్ రావుకు కూడ టీఆర్ఎస్‌లో అవమానాలు: ఈటల రాజేందర్

 తెలంగాణ ఉద్యమం సాగిన సమయంలో పలు సంఘాలతో సమ్మెలు నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం హక్కుల కోసం ఎవరూ కూడ సమ్మెలు చేయవద్దనే నిరంకుశ ధోరణితో కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, ఆర్టీసీ, విద్యుత్ శాఖలో సంఘాల ఏర్పాటు జరిగిన తీరును ఆయన గుర్తు చేశారు. ఈ సంఘాల్లో తమ కుటుంబానికి చెందినవారే ఉండాలనే ధోరణితో కేసీఆర్ వ్యవహరిస్తున్నాడని ఈటల  చెప్పారు. 

అన్ని సంఘాలకు హక్కులులేవన్నారు. ఇందిరా పార్క్ వేదికగా ఉద్యమాలు సాగించిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ ను ఎత్తివేశారన్నారు.  సమైక్య పాలనలో  సమ్మెలు, ఆందోళనలు చేయకుండా అడ్డుకొంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేవాళ్లమని ఆయన కేసీఆర్ ను ప్రశ్నించారు. సంక్షేమ పథకాలను తాను ఏనాడూ వ్యతిరేకించలేదన్నారు. కానీ అర్హులైన వారికి ఈ పథకాలను అమలు చేయాలని తాను కోరినట్టుగా చెప్పారు. రైతు బంథు పథకాన్ని కోటీశ్వరులకు ఇవ్వవద్దని తాను కోరినట్టుగా ఈటల రాజేందర్ తెలిపారు.