హైదరాబాద్: టీఆర్ఎస్ లో తనతో పాటు హరీష్ రావుకు  కూడ అవమానాలు  ఎదురయ్యాయని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.మాజీ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం నాడు షామీర్ పేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తనతో పాటు  హరీష్ రావుకు కూడ ఈ అవమానాలు ఎదురయ్యాయని ఆయన గుర్తు చేసుకొన్నారు..కేసీఆర్ ఆదేశాల మేరకు హరీష్ రావు పనిచేస్తుండవచ్చన్నారు.ఐదేళ్ల క్రితమే తనకు సీఎం కేసీఆర్ మధ్య గ్యాప్ వచ్చిందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ గుర్తు చేసుకొన్నారు. ఇవాళ్టికి ఇవాళ తనకు ఆయన మధ్య  ఈ గ్యాప్ రాలేదని ఆయన వివరించారు.

also read:టీఆర్‌ఎస్‌కు ఈటల రాజేందర్ రాజీనామా

కరీంనగర్ జిల్లాలో ఓ సమస్య వస్తే  జిల్లాకు చెందిన 9 మంది ఎమ్మెల్యేలతో రెండు కార్లలో తాను ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ ను కలిసేందుకు వెళ్తే తనతో పాటు అందరిని ఆపేశారని ఆయన గుర్తు చేసుకొన్నారు.  రెండోసారి కూడ అపాయింట్ మెంట్ తీసుకొని వెళ్లిన తర్వాత కూడ  రానివ్వలేదన్నారు. మూడోసారి కూడ అలానే జరిగిందని ఆయన చెప్పారు.పేరుకే మంత్రి పదవి ఉంటే ఏం ప్రయోజనమని తాను భావించానని చెప్పారు.. ఆత్మగౌరవం లేని మంత్రి పదవి అవసరం లేదకున్నాను ఇదే విషయాన్ని చెప్పానన్నారు. ప్రగతి భవన్ కాదు బానిసల భవన్ గా పేరు మార్చుకోవాలని ఎంపీ సంతోష్ కు సూచించినట్టుగా ఆయన ప్రస్తావించారు.సమైఖ్య పాలనలో తెలంగాణకు పాలన అనుభవం లేదనే హేళన చేసేవారన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే తాను అవమానాలను దిగమింగుకొన్నానని రాజేందర్ తెలిపారు.

2014 నుండి ఇప్పటివరకు సీఎంఓలో ఒక్క ఐఎఎస్ అధికారి ఉన్నాడా అని ఆయన ప్రశ్నించారు. ఒక్క ఎస్సీ, ఒక్క బీసీ అధికారి ఉన్నాడా అని ఆయన అడిగారు.  బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐఎఎస్ అధికారులు ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు.అనేక సమయాల్లో సంబంధిత శాఖల మంత్రి లేకుండానే సమీక్షా సమావేశాలు నిర్వహించారని ఆయన గుర్తు చేశారు. గతంలో తాను ఆర్ధిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో టీఎన్‌జీవో నేతలు వినతి పత్రం ఇస్తే ఈటల రాజేందర్  ఈ సమస్యను పరిష్కరిస్తారా అని హేళనగా మాట్లాడారని ఆయన గుర్తు చేశారు.