Asianet News TeluguAsianet News Telugu

ఆపరేషన్ 'దానం': చక్రం తిప్పిన తలసాని, అప్పుడు సైతం...

తలసానితో దానం భేటీ

Former minister Danam Nagendar meets minister Talasani Srinivas yadav


హైదరాబాద్: దానం నాగేందర్  కాంగ్రెస్ పార్టీని వీడడంలో తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  చక్రం తిప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలో చేరడంలో  ఆనాడు కూడ తలసాని కీలకంగా వ్యవహరించారు.

శుక్రవారం నాడు  దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. త్వరలోనే ఆయన టిఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉంది.ఈ వ్యవహారంలో కూడ  తలసాని కీలకంగా వ్యవహారించారని పార్టీలో ప్రచారం సాగుతోంది.

మాజీ మంత్రి  దానం నాగేందర్  శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ  ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.  పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలతో ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. త్వరలోనే ఆయన టిఆర్ఎస్‌లో చేరనున్నారు.  

పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఎఐసిసి అధ్యక్షుడికి దానం నాగేందర్  రాజీనామా లేఖలు పంపిన వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి దానం ఇంటికి వెళ్ళి ఆయనను బుజ్జగించారు. కానీ,  ఆయన మెత్తబడలేదు. శుక్రవారం సాయంత్రం మంత్రి తలసాని శ్రీనివాస్‌తో   ఎమ్మెల్యే క్వార్టర్‌లో దానం నాగేందర్ సమావేశమయ్యారు.రెండు రోజుల్లోనే దానం నాగేందర్ టిఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉందని సమాచారం.

2004 ఎన్నికల సమయంలో  దానం నాగేందర్ ‌కు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సికింద్రాబాద్ పార్లమెంట్ టిక్కెట్టు ఇచ్చింది. అయితే తాను ఆసిఫ్‌నగర్ నుండే  ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తానని దానం నాగేందర్ తేల్చి చెప్పారు. కానీ, కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు లభించలేదు.దీంతో రాత్రికి రాత్రే ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.  టిడిపిలో చేరారు. 2004లో జరిగిన ఎన్నికల్లో ఆయన టిడిపి అభ్యర్ధిగా ఆసిఫ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుండి  పోటీ చేసి విజయం సాధించారు.

అయితే ఆ ఎన్నికల్లో టిడిపి అధికారాన్ని కోల్పోయింది.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారు. పార్టీ మారడంతో దానం నాగేందర్ ఇబ్బంది పడ్డాడు. ఎక్కువ కాలం టిడిపిలో కొనసాగలేదు. టిడిపికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి కూడ రాజీనామా చేశారు. 

ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ఆసిఫ్ నగర్ నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా  దానం నాగేందర్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దానం ను ఓడించడంలో ఆనాడు టిడిపి విజయం సాధించింది. అయితే రాత్రికి రాత్రే కాంగ్రెస్ పార్టీ నుండి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుండి టిడిపిలోకి రావడంలో అప్పుడు టిడిపిలో ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలకంగా వ్యవహరించారు.

ప్రస్తుతం  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిణామల నేపథ్యంలో  దానం నాగేందర్  కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం సాగింది. అయితే ఆనాడు కారణాలు ఏమిటో తెలియదు కానీ, ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు.

ఇటీవల కాలంలో పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలతో దానం అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయాన్ని గమనించిన టిఆర్ఎస్ దానంకు గాలం వేసింది.  కాంగ్రెస్ పార్టీని గ్రేటర్ హైద్రాబాద్ లో దెబ్బతీయాలని భావిస్తున్న టిఆర్ఎస్ కు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొంది. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రపీ  తలసాని శ్రీనివాస్ యాదవ్ చక్రం తిప్పారు. దీంతో టిఆర్ఎస్ లో దానం నాగేందర్ చేరేందుకు  మార్గం సుగమమైంది.

ఇదిలా ఉంటే  దానం నాగేందర్ పార్టీ వీడడం నష్టమేనని కాంగ్రెస్ పార్టీ నేత వి. హనుమంతరావు అభిప్రాయపడ్డారు. దానం కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడుతున్నారో  చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.మరో వైపు సిఎల్పీ నేత జానారెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ నేతలు సమావేశమయ్యారు. దానం నాగేందర్ పార్టీ  మారే విషయంపై చర్చించారు.

ఎమ్మెల్యే క్వార్టర్‌లో మంత్రి తలసానితో సమావేశమైన తర్వాత దానం నాగేందర్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలపై తాను శనివారం నాడు స్పందించనున్నట్టు దానం నాగేందర్ ప్రకటించారు.

మరో వైపు  ఏ పార్టీలో ఉన్నా కానీ, తామిద్దరం 30 ఏళ్ళుగా స్నేహితులమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాకు చెప్పారు.  దానం కు జరిగిన అన్యాయం ఏమిటో మీకు తెలుసునని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. 

అయితే దానం నాగేందర్ ఏ కారణాలతో పార్టీని వీడాల్సి వస్తోందనే విషయాలపై శనివారం నాడు స్పందిస్తారని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. టిఆర్ఎస్‌లోకి దానం నాగేందర్ రాకను తాము ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios