హైదరాబాద్‌లో రూ. 13 లక్షలే అపార్ట్‌మెంట్.. ఎవరు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
Hyderabad: సొంతిల్లు ప్రతీ ఒక్కరి కల, అందులోనూ హైదరాబాద్ లాంటి నగరంలో ఓ ఫ్లాట్ ఉండాలని కోరుకుంటారు. అయితే కనీసం రూ. 60 లక్షలు పెడితే కానీ ఇల్లు దొరకని హైదరాబాద్‌లో రూ. 13 లక్షలకే అపార్ట్‌మెంట్ సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది.

హైదరాబాద్‌లో తక్కువ ధర ఇళ్లకు ప్రభుత్వం మరో అవకాశం
తెలంగాణలో సొంతింటి కల నెరవేర్చాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అవకాశాన్ని తీసుకొచ్చింది. తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగర పరిధిలో రెడీ-టు-మూవ్ ఫ్లాట్ల విక్రయానికి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఫ్లాట్లను ఆన్‌లైన్ లాటరీ విధానంలో కేటాయించనున్నట్లు అధికారులు ప్రకటించారు.
పోచారం, బండ్లగూడ ప్రాంతాల్లో 289 ఫ్లాట్లు
ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 289 ఫ్లాట్లను విక్రయానికి ఉంచారు. వీటిలో పోచారం ప్రాంతంలో 274 ఫ్లాట్లు అందుబాటులో ఉండగా, బండ్లగూడలో 15 సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఉన్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఉండటంతో ఈ ప్రాజెక్టులకు మంచి స్పందన వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ధరలు ఎలా ఉన్నాయంటే.?
సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ల విస్తీర్ణం సుమారు 523 నుంచి 645 చదరపు అడుగుల మధ్య ఉంటుంది. వీటి ధరలు రూ.13 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు నిర్ణయించారు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 761 చదరపు అడుగుల విస్తీర్ణంతో అందుబాటులో ఉన్నాయి. వీటి ధరను రూ.19 లక్షలుగా నిర్ణయించారు. మోడల్ ఫ్లాట్లకు చదరపు అడుగు ధర ఆధారంగా స్వల్పంగా ఎక్కువ మొత్తం నిర్ణయించారు. అన్ని ఫ్లాట్లకు అవసరమైన ప్రాథమిక సదుపాయాలు, పార్కింగ్ సౌకర్యం కల్పించారు.
లాటరీ తేదీలు, టోకెన్ అడ్వాన్స్ వివరాలు
ఈ ఫ్లాట్లకు ఫిబ్రవరి 4, 5 తేదీల్లో లైవ్ లాటరీ డ్రా నిర్వహించనున్నారు. యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. దరఖాస్తుదారులు జనవరి 31 సాయంత్రం 5 గంటల లోపు టోకెన్ అడ్వాన్స్ చెల్లించాలి. సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లకు రూ.1 లక్ష, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లకు రూ.2 లక్షలు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి. లాటరీలో ఎంపిక కాకపోతే ఈ మొత్తం తిరిగి చెల్లిస్తామని కార్పొరేషన్ స్పష్టం చేసింది.
అర్హతలు, లాక్-ఇన్ నిబంధనలు ఇవే
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారికి స్పష్టమైన అర్హతలు విధించారు.
* జీహెచ్‌ఎంసీ పరిధిలో దరఖాస్తుదారుడికి లేదా వారి కుటుంబ సభ్యులకు ఇల్లు లేదా ప్లాట్ ఉండకూడదు.
* నెలవారీ ఆదాయం 1BHK కోసం రూ.35,000 లోపు, 2BHK కోసం రూ.50,000 లోపు ఉండాలి. ఒక కుటుంబం నుంచి ఒక్క దరఖాస్తుకు మాత్రమే అనుమతి ఉంది.
* కేటాయించిన ఫ్లాట్‌ను ఐదేళ్ల పాటు ఇతరులకు బదిలీ చేయడానికి వీలు ఉండదు. ఈ లాక్-ఇన్ పీరియడ్ పూర్తైన తర్వాత మాత్రమే అమ్మకం లేదా బదిలీకి అవకాశం ఉంటుంది.

