అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ బిజెపికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు చంద్రశేఖర్ ఆ పార్టీకి రాజీనామా చేసారు. 

హైదరాబాద్ : తెలంగాణ బిజెపి మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి, వికారాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు చంద్రశేఖర్ బిజెపిని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బిజెపికి రాజీనామా చేసి ఆ లేఖను పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. గతకొంతకాలంగా బిజెపిలో జరుగుతున్న పరిణామాలపై బహిరంగంగానే తన అసంతృప్తిని బయటపెట్టారు మాజీ మంత్రి. దీంతో ఆయన పార్టీ మారతాడంటూ ప్రచారం జోరందుకుంది.దీన్నే నిజం చేస్తూ చంద్రశేఖర్ బిజెపికి రాజీనామా చేసారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో తెలంగాణలో బిజెపి ఒక్కసారిగా డీలాపడిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో డిల్లీ లిక్కర్ కేసులో కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ కాకపోవడం, రాష్ట్ర అధ్యక్ష పదవినుండి బండి సంజయ్ ను తొలగించడం వంటి పరిణామాలతో బిజెపి పరిస్థితి మరింత దిగజారింది. దీంతో ఇక బిజెపిలో వుంటే రాజకీయ భవిష్యత్ వుండదని భావిస్తున్న కొందరు నాయకులు పార్టీని వీడుతున్నారు. ఇలా తాజాగా మాజీ మంత్రి చంద్రశేఖర్ రాజీనామా చేసారు. 

తెలంగాణ బిజెపి అధ్యక్షుడికి పంపిన తన రాజీనామా లేఖలో చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేసారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమ పాలనకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని మాజీ మంత్రి ఆరోపించారు. కేసీఆర్ నియంత పాలనను, బిఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను నిలువరిస్తుందని భావించి తనలాగే అనేకమంది ఉద్యమకారులు కూడా బిజెపిలో చేరారని అన్నారు. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలతో ప్రజల్లో అనేక అనుమానాలు మొదలయ్యాయని... బిఆర్ఎస్, బిజెపి ఒక్కటేననే ప్రచారం కూడా జరుగుతోందని అన్నారు. బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా బిజెపిలో చేరిన తనలాంటి వారు భంగపాటుకు గురవుతున్నారని చంద్రశేఖర్ పేర్కొన్నారు. 

Read More ఎన్నికలకు సిద్ధమవుతోన్న టీ.కాంగ్రెస్.. ‘‘తిరగబడదాం - తరిమికొడదాం’’నినాదంతో జనంలోకి

ప్రస్తుతం తెలంగాణలో చోటుచేసుకుంటున్న రాజకీయా పరిణామాల నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో బిజెపిని వీడుతున్నట్లు మాజీ మంత్రి తెలిపారు. ఆయన రాజీనామాలో వికారాబాద్ జిల్లాలో బిజెపికి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. చంద్రశేఖర్ ఏ పార్టీలో చేరేది ప్రకటించకున్నా కాంగ్రెస్ చేరేందుకే బిజెపిని వీడినట్లు ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.