నల్గొండ: ఉమ్మడి నల్గొండ జిల్లాలో చిరుతపులి రెండు గంటల పాటు పారెస్టు అధికారులకు చుక్కలు చూపించింది. ఇద్దరు పారెస్ట్ అధికారులపై దాడికి దిగింది. చివరకు ఫారెస్ట్ అధికారులు చిరుతపులిని బంధించి జూ పార్క్ కు తరలించారు. 

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలోని రాజాపేట తండా శివారులో ఓ వ్యవసాయ పొలంలో అడవి పందుల కోసం వేసిన ఉచ్చులో గురువారం నాడు చిరుత చిక్కింది. పంట రక్షణ కోసం రైతు కంచెను ఏర్పాటు చేశాడు. ఈ కంచెలో చిరుతపులి చిక్కుకొంది.ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఈ ఏడాది మర్రిగూడ మండలం అజిలాపురం గ్రామంలో కూడ ఓ రైతు అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులో చిక్కుకొంది. ఆ సమయంలో ఫారెస్ట్ అధికారులు ఆ చిరుతపులిని బంధించి తీసుకెళ్లారు.ఇవాళ ఉదయం 10 గంటల నుండి చిరుతపులిని బంధించేందుకు ప్రయత్నించారు. రెండు గంటల పాటు పారెస్ట్ అధికారులకు చిరుత పులి చుక్కలు చూపించింది.

పారెస్ట్ అధికారులు చిరుతకు మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. రెండో సారి మత్తు ఇంజక్షన్ ఇచ్చే సమయంలోనే ఉచ్చు నుండి చిరుతపులి తప్పించుకొంది.  ఇద్దరు ఫారెస్ట్ అధికారులపై దాడి చేసింది.

పారిపోతూ అక్కడే ఉన్న వాహనం కింద దూరిపోయింది. చిరుతను పారెస్ట్ అధికారులు మత్తు ఇంజక్షన్ వేశారు. చిరుత  మత్తులోకి దిగిన తర్వాత బోనులో బంధించి జూ పార్క్ కు తరలించారు.

చిరుత దాడిలో  ఇద్దరు పారెస్ట్ అధికారులకు స్వల్పగాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.జనవరి 16న అజిలాపురం గ్రామంలో చిరుతపులి చిక్కుకొంది. ఉచ్చు వేసిన ఆ రైతుపై పోలీసులు కేసు పెట్టారు.