తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు ఇంకా కొనసాగుతూనే  ఉన్నాయి. నిన్నమొన్న ఓ మహిళా రైతు ఆత్మహత్య జరిగి గంటలు గడవకముందే మరో రైతు దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనేక రైతు కుటుంబాల్లో కుటుంబ పెద్ద మాత్రమే తనువుచాలించిన సందర్భాలున్నాయి. కానీ ఈ రైతు  కుంటుంబంలో భార్యాభర్తలిద్దరూ మరణించారు.

అప్పుల బాధతో రంగారెడ్డి జిల్లా మంచాల మండలం రంగాపూర్ గ్రామంలో రైతు కుటుంబo ఉరి వేసుకున్నారు. రైతు మోహనాచారి (45), ఆయన భార్య సరితా(40) ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన గ్రామ ప్రజలను కలచి వేసింది. ఇద్దరూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సందర్భంగా రైతు మోహనాచారి రాసిన సూసైడ్ నోట్ అందరినీ కలిచి వేస్తున్నది. చనిపోయే ముందు మూడు పేజీల సూసైడ్ లేఖను మోహనాచారి రాశారు. 

సూసైడ్ నోట్ లో ఏం రాశారంటే?

నా మనసుకు నచ్చినంత వరకు చదువు సాగించి.. నేను పొందిన విజ్ఞానం ప్లస్ నా మనసు చెప్పినట్లు ఆలోచించి మాకున్న గుట్టలు, రాళ్లు, ఎగుడు దిగుడుగా ఉన్న లావణ్య పట్టా 9.10 ఎకరాలు. ఈ వ్యవసాయ పొలాన్నే నా ఐడియాస్ ప్రకారం చదును చేసి.. ఉన్న వాటర్ సోర్స్ ను యూజ్ చేస్తూ.. నేను మరియు కొందరికైనా ఉపాధి కల్పించాలని నాకొరిక. ఈ తలంపుతో 2వేల సంవత్సరం నుంచి బాస్ మతి, సోనామసూరి, మిర్చి లాంటి పంటలు పండిస్తూ ఉండగా కరువులు, ఆకాల వర్షాలు, నెమళ్లు, అడవి పందుల బెడద వల్ల పంటలు లాస్ కవడం గమనించి 2011 సంవత్సరంలో.. మూడు HF ఆవులతో డైయిరిని మరియు 12వేల చిక్స్ తో బ్రాయిలర్ ఫామ్ వేసినాను. 7 బ్యాచ్ లలోనే వారి మోసాలు తెలిసి స్టాప్ చేసినాను. డైయిరీ కొనసాగిస్తూనే 2014 సంవత్సరంలో మా బంధువుల ఫ్లాట్స్ కొల్లట్రాల్ సెక్యూరిటీస్ గా ఆంధ్రాబ్యాంక్ లో పెట్టి 13లక్షల 45వేలు లోన్ తీసుకుని 268 గొర్రెలు తెచ్చి పెంచుతూ ఉండగా.. 2015 జనవరిలో వైరస్ ప్రబలి 164 గొర్రెలు చనిపోవడం వల్ల తీవ్రమైన లాస్ జరిగింది. ఈ టైమ్ లో లోన్ వాయిదాల చెల్లింపులో గ్రేస్ పిరియడ్ మరియు కొంత మొత్తం లోన్ గా ఇచ్చి మమ్మల్ని ముందుకు సాగునట్లు చేయవల్సిందిగా కోరుతూ వచ్చాము. పైగా కరువుల వలన బోర్లలో నీరు లభించక ఉన్న ఆవులు, గేదేలు, గొర్రెలను పోషించడం కష్టంగా మారి వీటి పోషణకు తెలిసినవారి దగ్గర అప్పులు చేస్తూ పోషించడము జరుగుతూ వస్తుంది. పైగా లోన్ వాయిదాలు చెల్లింపులో డైయిరీ వల్ల వచ్చే ఇన్ కమ్ సరిపోక ఆవులను, గేదేలను మరియు గొర్రెలను కూడా అమ్ముతూ లోన్ వాయిదాలు చెల్లిస్తూ వచ్చాము. ఇప్పటివరకు ఇలా 6 లక్షల 28వేలు లోన్ వాయిదాలు చెల్లించినాము. ఇలా లోన్ వాయిదాలు చెల్లించిన ప్రతిసారి నేను గ్రేస్ పీరియడ్ ఇవ్వమని మరియు కొల్లెట్రెడ్ సెక్యూరిటీస్ ఎక్కువగా ఉన్నది కావున ఇంకా కొంచెం లోన్ ఇవ్వగలిగితే లోన్ వాయిదాలు చెల్లించడానికి ఇన్ కమ్ సోర్స్ డెవలప్ అయ్యేటల్లు చేసుకుంటాము అని పదే పదే విన్నవించినా ఒకరు చేస్తామని, ఇంకొకరు వీలుకాదని కాలం వృధా చేస్తున్నారు కాని ఎలాంటి సహకారము నాకు చేయలేదు. ఇలా ఆవులు, గెదేలు, గొర్రెలు సంతతి కూడా తగ్గిపోవడం జరిగింది. ఇకపై లోన్ వాయిదాలు చెల్లించట భారంగా మారింది. చివరి ప్రయత్నంగా జూన్ 21 నాడు ఆంధ్రా బ్యాంక్ రిజీనల్ ఆఫీసుకు వెళ్లి ఎలాగైనా మాకు సహాయము చేయమని ఎన్నో రకాలుగా కోరినా వాళ్ల రూల్స్ కు వ్యతిరేకంగా చేయలేమని ఖరాఖండిగా చెప్పినారు. ఇలా బంధువుల ఆస్తులు కూడా కాపాడలేని పరిస్థితి వచ్చింది. ఇకపై జీవితంలో ముందుకు సాగడానికి ఎలాంటి మార్గం కనిపించడం లేక ఈ తనువును వదిలివేయడమే మార్గం అని నిర్ణయించుకున్నాను.