అన్ని మండలాల్లోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం.. : సీఎం కేసీఆర్
Hyderabad: ఎన్నికల తర్వాత అన్ని మండలాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి, అన్ని వర్గాల సంక్షేమం కోసం చేస్తున్న మంచి పనులను కొనసాగించేందుకు తమ బీఆర్ఎస్ కు ప్రజలు మద్దతు కొనసాగించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
Telangana Chief Minister K. Chandrasekhar Rao (KCR): ఎన్నికల తర్వాత రాష్ట్రంలోని ప్రతి మండలంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రజలకు హామీ ఇచ్చారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తే యువతకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మరోసారి బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి వ్యూహాలతో ముందుకు సాగుతూ ప్రచారం మొదలుపెట్టారు. అనేక కొత్త కార్యక్రమాలు, కొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నామనీ, దేశంలోనే తెలంగాణ అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అవతరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్, బీఆర్ఎస్ నూతన భవనాలను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ధరణి పై ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. రెవెన్యూ శాఖలో పెద్ద దోపిడీ జరిగిందనీ, భూములు ఎవరివో ఎవరికీ తెలియదనీ, కానీ తమ ప్రభుత్వం సంస్కరణలు తీసుకువచ్చి ధరణి పోర్టల్ తీసుకువచ్చిందన్నారు. ధరణి పోర్టల్ ను తొలగిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ లాబీయిస్టులను, వీఆర్వోలను తీసుకురావాలనుకుంటోందని మండిపడ్డారు. "ధరణిని వ్యతిరేకించిన నేతలను బంగాళాఖాతంలో పడేయండి. భారతదేశంలో ఎక్కడా లేని వీఆర్వో, పట్వారీ వ్యవస్థను తెలంగాణలో మళ్లీ ఏర్పాటు చేయాలని కొన్ని రాజకీయ శక్తులు డిమాండ్ చేస్తున్నాయి" అంటూ మండిపడ్డారు.
"వీఆర్వోల దోపిడీ, పహాణీలు మార్చడం, భూరికార్డులు మార్చడం సర్వసాధారణమైన పాత పాలనను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా చూశాం. ప్రస్తుతం కేవలం పదిహేను నిమిషాల్లోనే భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. కేవలం 10 నిమిషాల్లోనే టైటిల్ డీడ్ వస్తుంది. ధరణిని తొలగిస్తే ఎన్ని రోజులు కార్యాలయాలకు వెళ్లాలి. ఎన్ని దరఖాస్తులు సమర్పించాలని" కేసీఆర్ ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి, అన్ని వర్గాల సంక్షేమం కోసం చేస్తున్న మంచి పనులను కొనసాగించేందుకు తన బీఆర్ఎస్ కు ప్రజలు మద్దతు కొనసాగించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో దుష్ట శక్తులు అధికారంలోకి వస్తే రైతుబంధు, దళిత బంధు రద్దు చేస్తాయనీ, 24 గంటల కరెంటు ఉండదని హెచ్చరించారు.
ఒకప్పుడు మారుమూల జిల్లాగా పేరొందిన పాత ఆదిలాబాద్ జిల్లా నుంచి తమ ప్రభుత్వం నాలుగు జిల్లాలను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. పాత ఆదిలాబాద్ జిల్లాలో ఒకే ఒక వైద్య కళాశాల ఉండేది. అయితే, నేడు మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ లో కొత్తగా మూడు మెడికల్ కాలేజీలు వచ్చాయని తెలిపారు. జిల్లాలోని 396 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షలు, నిర్మల్, ముథోల్, ఖానాపూర్ మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు, 19 మండల కేంద్రాలకు రూ.20 లక్షల చొప్పున మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.