మోహన్ నగరంలో డిగ్రీ చదువుతూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మరో పక్క బంజారా పాటలు పాడుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
తన చావుకు ఎవరూ కారణం కాదంటూ లేఖ రాసి ఓ జానపద గాయకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ‘అమ్మా... నాన్న నన్ను క్షమించండి. ఎందుకో తెలియదు... నా మనసేమీ బాగాలేదు.. నాకు బతకాలని లేదు.. నేను ఎవరి వల్ల చనిపోవడం లేదు... నా స్నేహితులను ఏం అనొద్దం’టూ సూసైడ్ లేఖ రాసి బంజారా నేపథ్య గాయకుడు జటావత్ మోహన్ చంపాపేటలోని తన గదిలో ఉరి వేసుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు.
నల్గొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం పిల్లిగుండ్ల తండాకు చెందిన లక్ష్మి, మంగ్యల కుమారుడు జటావత్ మోహన్ నాయక్ (20) గత కొంతకాలంగా చంపాపేట రెడ్డికాలనీలో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. మంగళవారం రాత్రి గదిలో సూసైడ్ నోటు రాసి ఉరేసుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు.
బుధవారం ఉదయం స్థానికులు గమనించి సైదాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మోహన్ నగరంలో డిగ్రీ చదువుతూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మరో పక్క బంజారా పాటలు పాడుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అతను పాడిన పాటలు యూట్యూబ్‌లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఆ తర్వాత జానపథ నేపథ్య గాయకుడిగా పాటలు పాడటం ఆరంభించాడు.
కాగా.. ప్రేమ విఫలమైన కారణంగానే మోహన్ నాయక్ ఆత్మహత్యకు పాల్పడినట్లు.. పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా ఆ ధిశగా దర్యప్తు చేస్తున్నారు.
