తెలంగాణలో ముంచెత్తిన వరదలు.. రాష్ట్ర వ్యాప్తంగా 23 మంది.. ములుగులో 8మంది మృతి...
కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ముంచెత్తుతున్న వర్షాలు, వరదలతో 28మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఒక్క ములుగులోనే 8 మంది చనిపోయారు.

హైదరాబాద్ : తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు శుక్రవారం ఒక్క ములుగు జిల్లాలోనే మరో 14 మృతదేహాలను వెలికితీయడంతో మృతుల సంఖ్య 23కి చేరింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతోపాటు మరిన్ని మృతదేహాలు లభ్యమవుతున్నందున మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
14 మంది మృతుల్లో, ఎనిమిది మంది కొండాయి గ్రామస్తులే. గురువారం ఏటూరునాగారం గ్రామంలో వరద ఉధృతికి జంపన్న వాగులో బాధితులు కొట్టుకుపోయారు. గ్రామం మొత్తం ముంపునకు గురైంది, చాలా మంది నివాసితులు ఈ అనుకోని ఘటనకు షాక్ అయ్యారు.
తెలంగాణ : వరద బాధితులకు ఐఏఎఫ్ ఆపన్న హస్తం .. 600 కిలోల ఆహార ప్యాకెట్లను జారవిడిచిన హెలికాఫ్టర్లు
ప్రాణాలతో బయటపడిన గ్రామస్థులు ఒక ఎత్తైన ప్రదేశానికి చేరుకుని ఆశ్రయం పొందారు. నిరాశ్రయులైన గ్రామస్తుల కోసం ఐఏఎఫ్ హెలికాప్టర్లతో 600 కిలోల అత్యవసర సామాగ్రిని విడిచారు. అనంతరం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు గ్రామస్తులను ఏటూరునాగారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాలకు తరలించారు.
తెలంగాణలో గత కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కుండపోత వర్షం తీవ్రమైన వరదలకు దారితీసింది. ఫలితంగా ప్రాణ నష్టం, ఆస్తినష్టం, పునరావాస కేంద్రాలకు తరలించడం వంటివి జరిగాయి. వర్షాలు తగ్గుముఖం పట్టకపోయినా, ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, గతఈతగాళ్లు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎనిమిది మంది గ్రామస్తులు కొట్టుకుపోయిన కొండాయిలో సహాయక చర్యల కోసం ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేశామని, శుక్రవారం మృతదేహాలను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని ఏటూరునాగారం ఎఎస్పీ ఎస్ సంకీత్ తెలిపారు.
వరదలకు తీవ్రంగా ప్రభావితమైన ములుగులోని ఇతర గ్రామాలలో మల్యాల, దొడ్ల ఉన్నాయి. ఈ గ్రామాలనుంచి నివాసితులను పడవల ద్వారా ఖాళీ చేయించారు. నీళ్లు తగ్గకముందు ఇళ్లకు తిరిగి రావద్దని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రజలకు సూచించారు. జిల్లాలో గురువారం రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. ములుగులో భారీ వర్షం కురిసింది.
ఈ రుతుపవనాల సీజన్ లో దేశంలో మునుపెన్నడూ లేని విధంగా వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది: "తెలంగాణలో రికార్డు-బ్రేకింగ్ గణాంకాలు నమోదయ్యాయి. ములుగు 64.9 సెం.మీ.తో ముందంజలో ఉంది, ఈ సీజన్‌లో ఇంత విపరీతమైన వర్షాలు చూడటం ఇదే మొదటిసారి" అని ట్వీట్ చేసింది.
వర్షాలు తగ్గుముఖం పట్టడంతోపాటు నీరు తగ్గుతోంది. దీంతో పరిస్థితి మెరుగుపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ములుగుతో పాటు మహబూబాబాద్, ఆసిఫాబాద్, వరంగల్, సూర్యాపేట, వికారాబాద్, పెద్దపల్లిలో గత వారం రోజులుగా మరణాలు నమోదయ్యాయి.
భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లిలో అప్రోచ్ రోడ్ల మరమ్మతు పనులు గురువారం రాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. గ్రామాన్ని అరు అడుగులకు మించిన ఎత్తులో నీరు ప్రవహించడంతో అధికారులు హెలికాప్టర్‌లతో గ్రామంలోని 1,900 మంది నివాసితులను ఖాళీ చేయించవలసి వచ్చింది.
కొత్తగూడెంలోని భద్రాచలం వద్ద ఊహించినట్లుగానే వరద నీటి మట్టం పెరిగింది. రాత్రి 10 గంటలకు వరద నీటి మట్టం 53 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మూడో హెచ్చరిక జారీ చేశారు. దాదాపు 1000 మందిని లోతట్టు ప్రాంతాల నుంచి తరలించి సహాయక కేంద్రాల్లో ఉంచారు. కొత్తగూడెంలోని ముత్తాపురం వద్ద వరద నీటిలో చిక్కుకున్న 12 మందిని ఈతగాళ్ల సాయంతో రక్షించారు. నిర్మల్‌లో వరద నీటిలో చిక్కుకున్న 60 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.