వరదలు టీఆర్ఎస్ ను నిండా ముంచాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు వరదలు రావడం, సహాయక చర్యల్లో పెద్దగా చురుకుదనం కన్పించకపోవడం.. అధికార పార్టీమీద తీవ్ర ప్రభావాన్నే చూపించాయి.
వరదలు టీఆర్ఎస్ ను నిండా ముంచాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు వరదలు రావడం, సహాయక చర్యల్లో పెద్దగా చురుకుదనం కన్పించకపోవడం.. అధికార పార్టీమీద తీవ్ర ప్రభావాన్నే చూపించాయి. దీనికి తోడు ఆయా ప్రాంతాల్లో లోకల్ నాయకులు, ఎమ్మెల్యేలు ప్రజల ఆగ్రహానికి సరైన సమాధానం చెప్పలేకపోవడంతో అప్పటినుండే వ్యతిరేకత మొదలైందని చెప్పొచ్చు. అందుకే ప్రచారానికి వస్తే చాలు కార్యకర్తలను కూడా తరిమి, తరిమి కొట్టిన సంఘటనలు అక్కడక్కడా కనిపించాయి.
ఏదైమైనా ఎన్నికలకు ముందు హైదరాబాద్ వరదల ప్రభావం ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. వరద ప్రభావిత డివిజన్లలో తెరాస పై చేయి సాధించలేకపోగా ఆ ప్రాంతాల్లో భాజాపా సత్తా చాటింది. బీజేపీ గెలిచిన పలుచోట్ల తెరాస సిట్టింగ్ కార్పొరేటర్లు ఓటమి చవిచూశారు. ముఖ్యంగా 24 డివిజన్లపై వరద ప్రభావం అధికంగా కనిపించింది. 17 చోట్ల తెరాస సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది.
గత అక్టోబర్ లో కురిసిన భారీ వర్షాలకు హబ్సిగూడ, రామంతాపూర్, సుభాష్ నగర్, మల్లాపూర్, ఏఎస్ రావు నగర్, జీడిమెట్ల, చంపాపేట, నాగోలు, సరూర్ నగర్, గడ్డి అన్నారం, చైతన్యపురి, హయత్ నగర్, వనస్థలిపురం, లింగోజీగూడ, హస్తినాపురం, మన్సూరాబాద్, శాస్త్రిపురం, మైలార్ దేవ్ పల్లి, టోలిచౌక్, చాంద్రాయణగుట్ట, చిలుకానగర్, ఉప్పల్, నాచారం డివిజన్లలో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి.
ఈ ప్రాంతాల్లోని 15 డివిజన్లలో బీజేపీ పాగా వేసింది. కేవలం 4 స్థానాల్లోనే తెరాస విజయాన్ని దక్కించుకుంది. రెండు చోట్ల కాంగ్రెస్ గెలిచింది. 3 స్థానాలను ఎంఐఎం కైవసం చేసుకుంది.
అధికార పార్టీ ఏం చేయలేదా? అంటే చేసింది.. వరద బాధితులకు తోడ్పాటు అందించేందుకు సీఎం కేసీఆర్ రూ. 600 కోట్ల వరద సహాయాన్ని ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ. 10వేల చొప్పున అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే, తెరాస కార్పొరేటర్లు సాయం పంపిణీ, సహాయక చర్యల్లో పాల్గొనడంపై దృష్టి పెట్టలేదన్న విమర్శలున్నాయి. మంత్రి కేటీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటించిన సందర్భంలో మినమా కార్పొరేటర్లు బాధితులను పట్టించుకోలేదని, కొందరు కార్పొరేటర్లు, తెరాస నాయకులు బాధితులకు రూ. 5వేలు మాత్రమే అందించారని బాహాటంగానే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇదే అంతిమంగా ఫలితాల మీద ప్రభావం చూపించింది.
వరద బాధిత డివిజన్లలో ఫలితాలు..
బీజేపీ : చైతన్యపురి, హబ్సిగూడ, రాంమతాపూర్, చంపాపేట, నాగోల్, సరూర్ నగర్, గడ్డి అన్నారం, హయత్ నగర్, వనస్థలిపురం, లింగోజీగూడ, హస్తినాపురం, మన్సూరాబాద్, మైలార్ దేవ్ పల్లి, జీడిమెట్ల
టీఆర్ఎస్ : చిలుకానగర్, నాచారం, సుభాష్ నగర్, మల్లాపూర్
కాంగ్రెస్ : ఉప్పల్, ఏఎస్ రావు నగర్
ఎంఐఎం : శాస్త్రిపురం, టోలిచౌక్, చాంద్రాయణగుట్ట
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 5, 2020, 9:25 AM IST