Omicron: క‌రోనా క‌ల‌క‌లం.. హైద‌రాబాద్ లో కొత్త వేరియంట్ కేసు న‌మోదు !

Hyderabad-COVID-19: అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైనదనే అంచ‌నా వేస్తున్న ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్లు మ‌ళ్లీ పంజా విసురుతున్నాయి. ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్లు రోగనిరోధక శక్తిని తప్పించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండ‌టంతో పాటు మానవ శరీరంలో తిరిగి ఇన్ఫెక్షన్‌ను ప్రేరేపించే శ‌క్తిని క‌లిగివుంటాయ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. 
 

First case of BA.4 Omicron variant detected in Hyderabad

Coronavirus : క‌రోనా వైర‌స్ వెలుగులోకి వ‌చ్చి సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా.. దానికి వ్య‌తిరేకంగా టీకాలు అందుబాటులోకి వ‌చ్చినా.. దాని ప్రభావం మాత్రం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఇప్ప‌టికీ ప‌లు దేశాల్లో తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకూ త‌న రూపు మార్చుకుంటున్న కోవిడ్‌-19 అత్యంత ప్ర‌మాద‌క‌రంగా మారుతున్న ప‌రిస్థితులు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే వెలుగులోకి వ‌చ్చిన ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్లు రెట్టింపు వ్యాప్తి, ప్ర‌భావం క‌లిగించేవిగా ఉన్నాయ‌ని ప‌రిశోధ‌కులు, వైద్య నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఇక తాజాగా భార‌త్ లో బీఏ.4 ఒమిక్రాన్ వేరియంట్ తొలికేసు  న‌మోదైంది. తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ లో బీఏ.4 ఒమిక్రాన్ వేరియంట్ మొద‌టి కేసును గుర్తించారు. COVID-19 పాజిటివ్ రోగుల నుండి SARS-CoV-2 కొత్త వైవిధ్యాలను గుర్తించడానికి పనిచేస్తున్న జన్యు ప్రయోగశాలల సమూహం.. ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) మే 9న నమూనాను సేకరించింది. ఈ క్ర‌మంలోనే జీనోమ్ సిక్వెన్సింగ్ లో ఒమిక్రాన్ వేరియంట్ బీఏ.4ను గుర్తించారు. 

ప్ర‌స్తుతం తెలంగాణ స‌హా ఇతర భారతీయ రాష్ట్రాలలో BA.2 వేరియంట్ ప్రబలంగా ఉంద‌ని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. పరిశోధకులు రెండు వేరియంట్‌లను ఒరిజినల్ వెర్షన్ ఒమిక్రాన్ నుండి చాలా భిన్నంగా ఉన్న‌ట్టు గుర్తించారు. దీని కారణంగా అవి రోగనిరోధక శక్తిని తప్పించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.. మానవ శరీరంలో తిరిగి ఇన్ఫెక్షన్‌ను ప్రేరేపించ‌గ‌లిగే శ‌క్తి వాటికి ఉంటుంది. మే 12న, యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (ECDPC), BA.4 మరియు BA.5 ఓమిక్రాన్ వేరియంట్‌లను వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ (VoC)గా ప్రకటించింది.  BA.4, BA.5 వేరియంట్‌లు మొదటిసారిగా దక్షిణాఫ్రికాలో జనవరి-ఫిబ్రవరిలో గుర్తించారు. రెండు రకాలు దక్షిణాఫ్రికాలో మాత్రమే కాకుండా యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, డెన్మార్క్ స‌హా ప‌లు యూర‌ప్ దేశాల్లో కొత్త కోవిడ్‌-19 వేవ్ ల‌కుకార‌ణం అయ్యాయి. 

కాగా, తెలంగాణ‌లో కొత్త‌గా 45 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయ‌ని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో  రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,92,710 కు చేరుకుందని తెలిపింది.  అలాగే, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 4,111 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసుల్లో హైదరాబాద్‌లో అత్యధికంగా 28 కేసులు నమోదయ్యాయి. మొత్తం 32 మంది వ్యాధి నుండి కోలుకోవడంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 7,88,216కి చేరుకుంది. యాక్టివ్ కేసులు 383గా ఉన్నాయి. కేసు మరణాల రేటు 0.51 శాతం మరియు రికవరీ రేటు 99.43 శాతంగా ఉంది. 

ఇదిలావుండగా, భారత్ లో కరోనా వైరస్ కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,364 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 4,31,29,563కు చేరాయి. ఇదే సమయంలో వైరస్ తో పోరాడుతూ 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 5,24,303కు పెరిగింది. మరణాల రేటు 1.22 శాతంగా ఉండగా, రికవరీ రేటు 98.7 శాతంగా ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios