Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ ఏర్పాటును వ్య‌తిరేకించిన వారితో కుమ్మ‌క్క‌య్యారు : కాంగ్రెస్ పై హ‌రీశ్ రావు ఫైర్

Harish Rao: సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన విజయాలను మంత్రి హరీశ్ రావు ప్ర‌స్తావిస్తూ.. గత తొమ్మిదిన్నరేళ్లుగా రాష్ట్రం కరువు, కర్ఫ్యూల నుంచి విముక్తి పొందిందన్నారు. అబద్ధపు వాగ్దానాలకు మారుపేరైన కాంగ్రెస్ ను నమ్మడం వల్ల కలిగే నష్టాలను ప్రజలు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
 

Finance Minister Harish Rao slams Congress for colluding with those who opposed telangana formation  RMA
Author
First Published Nov 7, 2023, 4:05 AM IST

Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) విజ‌యం సాధిస్తుంద‌ని ఆ పార్టీ నాయ‌కుడు, రాష్ట్ర ఆరోగ్య‌, ఆర్థికశాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు అన్నారు. ఎన్నికల పోలింగ్‌ రోజైన నవంబర్‌ 30 తర్వాత బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ విజయం సాధిస్తుందని ఆయ‌న‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు పరోక్షంగా పరస్పరం కుమ్మక్కైనప్పటికీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) విజ‌యాన్ని ఆప‌లేర‌ని తెలిపారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నగేష్‌ ముదిరాజ్‌ బీఆర్‌ఎస్‌లో చేరగా, సోమవారం తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు పార్టీలోకి స్వాగతం పలికారు. ఆయ‌న‌తో పాటు  హైదరాబాద్ నగరం, ముఖ్యంగా ముషీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ కండువా క‌ప్పుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి హ‌రీశ్ రావు మాట్లాడుతూ.. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ , టీడీపీలు అపవిత్ర పొత్తు పెట్టుకున్నాయని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వారితో కాంగ్రెస్ మరోసారి జతకట్టిందని మండిప‌డ్డారు. టీడీపీతో పాటు వైఎస్‌ షర్మిల నేతృత్వంలోని వైఎస్‌ఆర్‌టీపీ కూడా కాంగ్రెస్‌కు మద్దతు పలుకుతున్న క్ర‌మంలో ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో తెలంగాణ సాధించిన విజయాలను హరీశ్‌రావు ప్ర‌స్తావిస్తూ.. గత తొమ్మిదిన్నరేళ్లుగా రాష్ట్రం కర్ఫ్యూలు, కరువు నుంచి విముక్తి పొందిందని ఆయన ఉద్ఘాటించారు. తప్పుడు వాగ్దానాలకు పేరుగాంచిన కాంగ్రెస్‌ను విశ్వసించడం వల్ల కలిగే నష్టాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. సీఎం నాయ‌క‌త్వంలోని బీఆర్ఎస్ రాష్ట్రంలో మెరుగైన పాల‌న అందించింద‌ని తెలిపారు. ప్ర‌జా సంక్షేమం కోసం అనేక ప‌థ‌కాలు అములు చేస్తోంద‌న్నారు. ముదిరాజ్, గంగపుత్ర వర్గాలను రాజకీయంగా, సామాజికంగా ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కట్టుబడి ఉన్నారన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios