ఎల్బీ స్టేడియంలో కుస్తీ పోటీల్లో రచ్చ రచ్చ.. పహిల్వాన్‌ల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు..
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కుస్తీ పోటీల్లో ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరు పహిల్వాన్‌ల మధ్య వాగ్వాదం గొడవకు దారి తీసింది.

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కుస్తీ పోటీల్లో ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరు పహిల్వాన్‌ల మధ్య వాగ్వాదం గొడవకు దారి తీసింది. ఒక్కసారిగా ఇద్దరు పహిల్వాన్‌లు, వారితో పాటు వచ్చిన ఇరువర్గాల సభ్యుల ఘర్షణకు దిగి.. దాడులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. దీంతో ఎల్బీ స్టేడియం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. పహిల్వాన్‌ల గొడవతో భయాందోళనకు గురైన ప్రేక్షకులు స్టేడియం నుంచి బయటకు పరుగులు తీశారు.
వివరాలు.. ఎల్బీ స్టేడియంలో గత మూడు రోజులుగా మోదీ కేసరి దంగల్ కుస్తీ పోటీలు జరుగుతున్నాయి. అయితే గత రాత్రి కుస్తీ పోటీల్లో ఒక్కసారిగా వివాదం చెలరేగింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇద్దరు పహిల్వాన్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఇరువర్గాలకు చెందిన అనుచరులు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. దీంతో ఎల్బీ స్టేడియంలో భయానక వాతావరణం నెలకొంది. దీంతో ప్రేక్షకులు అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ఘర్షణలో పలువురు ప్రేక్షకులు కూడా గాయపడ్డారు.
ఇక, అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఈ ఘటనలో జోక్యం చేసుకుని ఇరువర్గాలకు చెందిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘర్షణలో గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించారు. ఇక, తొలుత ఎవరు ఎవరిపై దాడి చేశారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే, ఈ ఘర్షణకు సంబంధించి ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది.