ఆర్థిక లావాదేవీలతో ఓ మహిళా రియాల్టర్ దారుణ హత్యకు గురైంది. కరీంనగర్ లో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. 

కరీంనగర్ : రియల్ ఎస్టేట్ వ్యాపారం చేతినిండా డబ్బులనే కాదు… ప్రాణాలకు ఏ క్షణమైనా ప్రమాదం పొంచి ఉండేలా చేస్తుంది.. ఆ వ్యాపారంలోని ఆర్థిక లావాదేవీలు అనేక నేరాలకు దారితీస్తున్నాయి. ఈ ఆర్థిక లావాదేవీలే కరీంనగర్ లో ఓ వివాహిత నిండు ప్రాణాలు బలి తీసుకున్నాయి. ఈ ఘటన కరీంనగర్ వన్ టౌన్ పరిధిలో జరిగింది. దీనికి సంబంధించి మృతురాలి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…

కరీంనగర్ లోని భగత్ నగర్ లో ఉన్న క్రిస్టియన్ ప్లాజా అపార్ట్మెంట్ లో వివాహిత గుండా గుండా సరిత (35) దారుణ హత్యకు గురైంది. గోదావరిఖనిలో సరిత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. సరిత భర్త గుండా శ్రీపాల్ రెడ్డికి ఇది నచ్చలేదు. దీంతో అభ్యంతరం వ్యక్తం చేశాడు. 2001లో సరిత, శ్రీపాల్ రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దీంతో యేడాదిగా ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. 

సరితది గోదావరిఖని 8 ఇన్ క్లైవ్ కాలనీ. ఆకుల ఓదెలు, లక్ష్మీ దంపతుల రెండో కుమార్తె సరిత. ఇక గుండా శ్రీపాల్ రెడ్డిది మంచిర్యాల జిల్లా జన్నారం మండలం దేవునిగూడెం. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత గోదావరిఖనిలో కాపురం పెట్టారు. వీరికి అస్మిత్ రెడ్డి, మణిత్ రెడ్డి అని ఇద్దరు పిల్లలు ఉన్నారు.

శకుని పాత్రలు వెళ్లిపోయాయి.. పార్టీకి పట్టిన శని, పీడ విరగడయ్యింది: మంత్రి హరీశ్ రావు

సరిత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం నచ్చకపోవడంతో భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సరిత ఏడాదిగా భర్తకు దూరంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పనిమీద అప్పుడప్పుడు కరీంనగర్ కి వెళ్ళేది. ఈ క్రమంలోనే ఆమెకి వేరే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కరీంనగర్ లోని భగత్ నగర్, క్రిస్టల్ అపార్ట్మెంట్ 203 ఫ్లాట్లో ఉంటున్న వెంకటేష్ అనే వ్యక్తితో సరితకు పరిచయం ఏర్పడింది.

ఈ పరిచయంతోనే అతడికి దాదాపు రూ.20 లక్షలకు పైగా డబ్బులు కూడా ఇచ్చింది. సరిత తమ్ముడు ఆకుల సతీష్ కూడా కరీంనగర్లోని రాంనగర్ లోనే ఉంటాడు. పిల్లలకి వేసవి సెలవులు ఉండడంతో సరిత పిల్లలతో సహా తమ్ముడు ఇంటికి వచ్చి ఉంటుంది. ఇక స్కూలు తెలుస్తుండడంతో జూన్ 28వ తేదీన పిల్లలని సరిత గోదావరిఖనికి పంపించింది. 

రియల్ ఎస్టేట్ పనులు నిమిత్తం వెంకటేష్ తో కలిసి వరంగల్ కు వెళుతున్నానని అదే రోజు సాయంత్రం తమ్ముడికి చెప్పి వెళ్ళింది. మర్నాడు తమ్ముడు ఫోన్ చేయగా సరిత ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. శుక్రవారంనాడు సరిత ఫోన్ నుంచి ఆమె తమ్ముడైన ఆకుల సతీష్ కు వెంకటేష్ వాట్సప్ కాల్ చేశాడు. సరిత తల గోడకు కొట్టుకుని గాయపడిందని తెలిపాడు. ఆమె ఇప్పుడు ఫ్లాట్ లోనే ఉందని.. తాళం పగలగొట్టి ఆమెకు తీసుకెళ్లాలని చెప్పాడు. ఆ తరువాత పరారయ్యాడు.

దీంతో సరిత తమ్ముడు సతీష్.. సోదరి స్వాతి వెంటనే అపార్ట్ మెంట్ కు వెళ్లి... తాళం పగలగొట్టిలోపలికి వెళ్లి చూశారు. అక్కడ రక్తపు మడుగులో పడి ఉంది. ముఖం, తల మీద తీవ్ర గాయాలతో సరిత పడి ఉంది. ఆమె మెడకు చున్నీ బిగించి ఉంది. వెంటనే సతీష్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ రవికుమార్, సిబ్బంది, క్లూస్ టీంతో ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. పలు ఆధారాలు సేకరించారు. కరీంనగర్ ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టు మార్టం కోసం పంపించారు. 

ఆర్థిక లావాదేవీలే సరిత మృతికి కారణం అని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే క్రమంలో దాదాపు రూ.25 లక్షలను పెట్టుబడి కింద సరిత వెంకటేష్ కు ఇచ్చిందని తెలిపారు. ఈ డబ్బు తిరిగివ్వలని వెంకటేష్ ను అడిగగా.. ఇద్దరికీ గొవలు జరిగేవని సతీష్ తెలిపాడు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్న పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.