కేవలం రెండువందల కోసం కన్నతండ్రి కొడుకును కొట్టిచంపిన దారుణ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. 

జగిత్యాల : కేవలం రెండు వందల కోసం తండ్రీ కొడుకుల మధ్య గొడవ చెలరేగి చివరకు ఒకరి హత్యకు దారితీసింది. కన్న ప్రేమను మరిచిన తండ్రి ఆస్తికోసం వేధిస్తును చితకబాది అతి కిరాతకంగా హతమార్చాడు. మానవ సంబంధాలన్ని ఆర్థిక బంధాలేనని మరోసారి నిరూపించిన ఈ దుర్ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. 

సింగరేణి సంస్థలో పనిచేసే భూమయ్య పదవీ విరమణ పొందాడు. ఉద్యోగం చేసే సమయంలో కుటుంబంతో కలిసి గోదావరిఖనిలో నివాసముండేవాడు. రిటైర్మెంట్ తర్వాత భార్య రాజమ్మ, కొడుకు మహేష్(35) కుటుంబంతో కలిసి స్వగ్రామం రాంనూర్ లో నివాసముంటున్నాడు. అయితే తాగుడుకు బానిసైన కొడుకు మహేష్ జులాయిగా తిరుగుతూ తల్లిదండ్రులకు భారంగా మారాడు. ఆస్తి పంపకాల విషయంలో భూమయ్య, కొడుకుకు మధ్య వివాదం రాజుకుంది. ఈ గొడవ చివరకు కన్న కొడుకున్న తండ్రి దారుణంగా కొట్టిచంపే స్థాయికి చేరింది. 

 Read More హైదరాబాద్‌లో విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య.. !

గత సోమవారం తండ్రీ కొడుకులు గొడవపడ్డారు. రూ.200 ఇవ్వాలని మహేష్ తండ్రి భూమయ్యను అడగ్గా అందుకు అతడు నిరాకరించాడు. దీంతో మహేష్ తండ్రితో గొడవకు దిగగా సహనం కోల్పోయిన భూమయ్యలో రాక్షసుడు మేల్కొన్నాడు. వ్యవసాయ భూమిని కౌలు చేసే శేఖర్ తో కలిసి కొడుకును అతి దారుణంగా చితకబాదాడు భూమయ్య. దీంతో కాళ్లు, చేతులు విరిగి రక్తపుమడుగులో పడిపోయిన మహేష్ ను కుటుంబసభ్యులు హాస్పిటల్ కు తరలించారు. 

మొదట జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స అందించినా పరిస్థితి మెరుగుపడకపోవడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మహేష్ మృతిచెందాడు. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మహేష్ ను చంపిన భూమయ్య, శేఖర్ ను అదుపులోకి తీసుకున్నారు. కేవలం రెండు వందల కోసం కొడుకును తండ్రి చంపిన ఈ ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది.