మంచిర్యాలలో ఘోరం : కళ్ళముందే కట్టుకున్న భర్త, కన్నకొడుకు దుర్మరణం... ఓ ఇల్లాలి కన్నీటిగాధ
రెండు నెలల క్రితమే ఏడాదిన్నర కూతురు, ఇప్పుడు రోడ్డు ప్రమాదం భర్త కొడుకు మృతిచెందడంతో ఓ మహిళ ఒంటరిదయ్యింది. కళ్ల ముందే భర్త, కొడుకు మృతిచెందడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది.

మంచిర్యాల : ఓ తాగుబోతు డ్రైవర్ నిర్లక్ష్యం నిరుపేద కుటుంబంలో విషాదం నింపింది. తాగిన మైకంలో మితిమీరిన వేగంతో వ్యాన్ నడిపిన డ్రైవర్ మత్తులో తండ్రీకొడుకులను బలితీసుకున్నాడు. బస్సు కోసం రోడ్డుపక్కన ఆగిన తండ్రికొడులపైకి వ్యాన్ దూసుకెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. తల్లి మాత్రం తృటిలో ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు. ఈ దుర్ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రేండ్లగూడలో జోగు సాయికుమార్(36) భార్యా బిడ్డలతో కలిసి నివాసముంటున్నాడు. ఇతడి స్వస్థల సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అనంతారం కాగా ఉపాధి నిమిత్తం మంచిర్యాల జిల్లాలో వుంటున్నాడు. ఓ రైతు వద్ద పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
ఇటీవల ఏడాదిన్నర వయసున్న సాయికుమార్ కూతురు అనారోగ్యంతో మరణించింది. ఈ బాధ నుండి ఆ కుటుంబం తేరుకోకముందే రోడ్డు ప్రమాదం తండ్రీ కొడుకు మృతిచెందారు. గురువారం స్వగ్రామం అనంతారం వెళ్లడానికి సిద్దమైన సాయికుమార్ భార్య మంజుల, కొడుకు లక్ష్మణ్(7) తో కలిసి బయలుదేరాడు. కలమడుగులో బస్సుకోసం ఎదురుచూస్తుండగా ఓ వ్యాన్ రూపంలో వీరిపైకి మృత్యువు దూసుకొచ్చింది.
Read More రన్నింగ్ బస్సులో చెలరేగిన మంటలు... 26 మంది ప్రయాణికులతో వెళుతుండగా
మహారాష్ట్ర నుండి మంచిర్యాల వైపు వెళుతున్న డిసిఎం వ్యాన్ కలమడుగు వద్ద అదపుతప్పింది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన వ్యాన్ ఓ స్తంభాన్ని డీకొట్టి రోడ్డుపక్కన నిలబడ్డ సాయికుమార్, లక్ష్మణ్ లపై బోల్తా పడింది. దీంతో తండ్రీకొడుకు అక్కడిక్కడే మృతిచెందారు. ప్రమాద సమయంలో మంజుల మంచినీటికోసం పక్కకు వెళ్లడంతో ప్రాణాలతో బయటపడింది. డిసిఎం డ్రైవర్ మద్యం మత్తే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
కళ్లముందే కట్టుకున్న భర్త , కన్నకొడుకు ప్రాణాలు కోల్పోవడంతో మంజుల బోరున విలపిస్తోంది. ఇటీవలే కూతురు, ఇప్పుడు భర్త, కొడుకు... ఇలా కుటుంబం మొత్తాన్ని కోలపోయి మంజుల బాధ అందరికీ కన్నీరు తెప్పిస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తండ్రీకొడుకు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.