రన్నింగ్ బస్సులో చెలరేగిన మంటలు... 26 మంది ప్రయాణికులతో వెళుతుండగా
జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.

నల్గొండ : రన్నింగ్ లో వున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి అందరూ చూస్తుండగానే మొత్తం వ్యాపించాయి. ఇలా రోడ్డుపైనే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కాలిపోయిన ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే ఈ బస్సు ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
వివరాల్లోకి వెళితే... గురువారం రాత్రి హైదరాబాద్ నుండి నెల్లూరుకు 26 మంది ప్రయాణికులతో వేమూరి-కావేరి ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. తెల్లవారుజామున ఈ బస్సు నల్గొండ జిల్లాలో ప్రయాణిస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై బస్సు వేగంగా దూసుకెళుతుండగా ఒక్కసారిగా టైర్ పగిలింది. దీంతో టైర్ రిమ్, రోడ్డుకు మధ్య రాపిడి కారణంగా నిప్పురవ్వలు మొదలై మంట అంటుకుంది.
వేగంగా వుళుతుండగా టైర్ పేలినప్పటికి డ్రైవర్ బస్సును నియంత్రించి రోడ్డుపక్కన ఆపాడు. టైరు పేలిన శబ్దం, బస్సు కుదుపులతో అప్పటికే నిద్రలేచిన ప్రయాణికులు వెంటనే కిందకు దిగారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
Read More టీచర్స్ డే తర్వాతిరోజే ఘోరం... రైలు కిందపడి రెండు ముక్కలైన ఉపాధ్యాయురాలి శరీరం
ప్రయాణికులందరూ చూస్తుండగానే చిన్నగా మొదలైన మంటలు బస్సంతా వ్యాపించాయి. కొద్ది సేపట్లోనే బస్సు మొత్తం మంటల్లో కాలిపోయింది. ముందుగానే అప్రమత్తం కావడంతో ప్రయాణికులతో పాటు డ్రైవర్, సిబ్బంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.
ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. చీకట్లో ప్రయాణికులకు ఇబ్బంది పడకుండా అందరినీ మరో బస్సులో అక్కడినుండి తరలించారు.