‘తెలంగాణలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే’.. కర్ణాటక ఎన్నికల ఫలితాన్ని ముందే చెప్పిన జ్యోతిష్కుడి మరో అంచనా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ప్రముఖ జ్యోతిష్కుడు రుద్ర కరణ్ పర్తాప్ జోస్యం చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే కొలువుదీరుతుందని స్పష్టం చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కచ్చితత్వంతో కొన్ని నెలల ముందే ఆయన అంచనా వేశారు.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ బలంగా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్కుడు రుద్ర కరణ్ పర్తాప్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని జోస్యం చెప్పారు.
రుద్ర కరణ్ పర్తాప్ జోస్యానికి ప్రాధాన్యత ఉన్నది. గత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఆయన ముందుగానే కచ్చితమైన అంచనాను చెప్పారు. ఆయన అంచనాలే నిజమయ్యాయి. దీంతో తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఆయన చేసిన జోస్యానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
‘నమో రుద్రాయా.. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కే చంద్రశేఖర్ రావు ప్రభుత్వమే మళ్లీ అధికారాన్ని చేపడుతుంది. ఆ ప్రభుత్వమే తెలంగాణను పాలిస్తుంది’ అని రుద్ర కరణ్ పర్తాప్ మే 27వ తేదీన సాయంత్రం 7.38 గంటలకు ఓ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
Also Read: కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుందని సీట్లతో సహా ముందే చెప్పిన జోతిష్కుడు.. 2024 ఎన్నికలపైనా వ్యాఖ్య
ఇదిలా ఉండగా.. వేదిక్ అస్ట్రాలజర్ రుద్ర కరణ్ పర్తాప్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ముందే ఊహించారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనే కాదు.. ఎన్ని సీట్లను కైవసం చేసుకుందో కూడా ముందే జోస్యం చెప్పారు.
ఈ ఏడాది మార్చి 31వ తేదీన ఆయన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై ట్వీట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల (మే) 10వ తేదీన జరగ్గా.. అదే నెల 13వ తేదీన ఫలితాలు వచ్చాయి. రుద్ర కరణ్ పర్తాప్ తన ట్వీట్‌లో ఇలా పేర్కొన్నారు. మే నెల బీజేపీకి అనుకూలంగా లేదని తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కూడా బీజేపీ కంటే కాంగ్రెస్‌కే అధికంగా ఉన్నాయని అంచనా వేశారు. డీకే శివకుమార్ గొప్ప యోగిని దశ గుండా వెళ్లుతున్నారని తెలిపారు.
కాగా, 18 రోజుల తర్వాత ఒక ట్విట్టర్ యూజర్ ఓ ప్రశ్న వేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎన్ని సీట్లతో గెలుస్తుంది సార్ అంటూ అడిగారు. అందుకు రుద్ర కరణ్ పర్తాప్ సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ 123 నుంచి 133 సీట్లు గెలుచుకుంటుందని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దాదాపు అన్నే సీట్లు గెలుచుకోవడం గమనార్హం.