Asianet News TeluguAsianet News Telugu

‘ఎల్లరి గడ్డలు’ తిని ఒకే కుటుంబంలో ఏడుగురికి అస్వస్థత.. అందులో ఇద్దరు మృతి..

ఎల్లరిగడ్డలు అనే దుంపలు తిని ఒకే కుటుంబంలోని ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన మెదక్ లో జరిగింది.

family fall sick and two dead after eating some kind of yams in medak
Author
First Published Dec 8, 2022, 8:44 AM IST

మెదక్ జిల్లా : మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల వెంకట్రావుపేటలో ఈ ఘటన వెలుగు చూసింది. ఓ కుటుంబంలోని ఏడుగురు ఒకేసారి అస్వస్థతకు గురయ్యారు. ఇది రెండురోజుల క్రితం జరగగా..  బుధవారం నాడు కొద్ది గంటల వ్యవధిలోనే.. ఆ ఏడుగురులో తల్లి, కొడుకు ఇద్దరు మృతి చెందారు. తమ ప్రాంతంలో దొరికే ఓ రకమైన దుంపలు తిన్న తర్వాత వీరంతా అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. వీటిని స్థానికంగా ‘ఎల్లరి గడ్డలు’ అని పిలుస్తారు. 

దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు, గ్రామస్తులు,  కుటుంబీకులు రకరకాలుగా తెలిపారు. నీలం శ్రీనివాస్ (50) కుటుంబంతో కలిసి వెంకట్రావు పేటలో నివసిస్తున్నాడు. అతనికి తల్లి వెంకటమ్మ (70), భార్య లక్ష్మి, ఇద్దరు కొడుకులు, ఓ సోదరి  ఉన్నారు. పెద్ద కొడుకు భానుచందర్ వివాహం అయ్యింది. కోడలు రూపాలి. చిన్న కొడుకు శ్రీకాంత్, సోదరి లలిత. వీరంతా.. ఈనెల ఐదో తేదీన రాత్రి భోజనం అయిన తర్వాత ‘ఎల్లరి గడ్డ’ పాలల్లో వేసుకుని తిన్నారు. వీటిని లలిత  పొలం నుంచి తీసుకు వచ్చింది. 

వార్నీ.. అమ్మాయిలను అక్రమ రవాణా చేస్తూ, అడిగితే ‘సెక్స్ దైవిక విధి’ అంటూ సమర్థింపు....

భోజనంతో పాటు వీటిని తిని పడుకున్నారు. అర్థరాత్రి దాటిన తర్వాత వాంతులు, విరేచనాలు కావడం మొదలయింది. ఇంట్లోని ఏడుగురి పరిస్థితీ ఇదే. దీంతో మంగళవారం తెల్లవారే నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రికి పరిగెత్తారు. అక్కడ చికిత్స అనంతరం భానుచందర్, శ్రీకాంత్, రూపాలి కోలుకున్నారు. దీంతో వీరిని ఇంటికి పంపించారు. ఇంటికి వచ్చిన తర్వాత శ్రీనివాస్ బుధవారం తెల్లవారుజామున చనిపోయాడు. ఇక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకటమ్మ, లలితల పరిస్థితి విషమంగా మారింది. వీరిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

తరలిస్తుండగా మార్గమధ్యలోనే వెంకటమ్మ మృతి చెందింది. లలితా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. భానుచందర్ భార్య లక్ష్మికి నర్సాపూర్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తండ్రి, నానమ్మ మృతి విషయంలో భానుచందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కౌడిపల్లి పోలీసులు తెలిపారు. శ్రీనివాస్ కు గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు నర్సాపూర్ ఆసుపత్రి పర్యవేక్షకుడు నజీర్ మీర్జాబేగ్ చెబుతున్నారు. ఇక సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ కలుషిత ఆహారం తినడం వల్లే  వెంకటమ్మ చనిపోయిందని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios