ఇద్దరు భార్యలకు లక్ష్మీదేవిలా, తానేమో విష్ణుమూర్తిలా వేశమేసి మహబూబ్ నగర్ లో భక్తులను మోసం చేస్తున్న ఓ దొంగస్వామి గుట్టు రట్టయ్యింది. 

మహబూబ్ నగర్ : నేటి సమాజంలో భక్తి ముసుగులో ప్రజలను నమ్మించే దొంగబాబాలు ఎక్కువయిపోయారు. ఆ భగవంతుడి అనుగ్రహం దక్కేలా చేస్తామని భక్తులను నమ్మించే స్వాములు... ప్రార్థనలతో సమస్యలను దూరంచేస్తామనే మతప్రచారకులు... మంత్రాలతో సమస్యలను పరిష్కరిస్తామనే బాబాలు రోజుకొకరు పుట్టుకొస్తున్నారు. ఇలాంటివారిని ప్రజలు కూడా ఈజీగా నమ్మి మోసపోతున్నారు. ఇలా అందభక్తితో మోసపోయేవారు ఉన్నంతకాలం దొంగబాబాలు పుట్టుకొచ్చి మోసం చేస్తూనే వుంటారు. చివరకు దేవుడి పేరుచెప్పి మెసం చేసే స్థాయి నుండి తానే దేవుడినని చెప్పుకునే స్థాయికి దొంగబాబాలు చేరుకున్నారు. ఇలాగే తానే విష్ణుమూర్తి స్వరూపమంటూ అమాయక ప్రజలను మోసంచేస్తున్న ఓ దొంగబాబా గుట్టురట్టుచేసారు మహబూబ్ నగర్ పోలీసులు. 

వివరాల్లోకి వెళితే... తమిళనాడుకు చెందిన రంగనాథం ఇద్దరు భార్యలతో కలిసి మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చాడు. ఏ కష్టమూ లేకుండా ఈజీగా మని సంపాదించాలని భావించిన అతడు అందుకోసం ఏకంగా దేవుడినే వాడుకుంటున్నాడు. తాను కలియుగంలో పుట్టిన విష్ణుమూర్తినని... ఎవరికి ఏ సమస్య వున్నా తన శక్తులతో పరిష్కరిస్తానని మాయమాటలు చెప్పడం ప్రారంభించాడు. దేవుడినని చెప్పుకోవడమే కాదు విష్ణుమూర్తి వేషమేసి శేషతల్పంపై పడుకున్నట్లు ఫోజులు కూడా ఇచ్చేవాడు. ఇద్దరు భార్యలకు లక్ష్మిదేవి వేషం వేయించి కాళ్లు నొక్కించుకునేవాడు. ఇలా అచ్చం విష్ణుమూర్తిలా మారి ప్రజలను మోసం చేయడం ప్రారంభించాడు. 

తానే భగవంతుడినంటూ విష్ణుమూర్తి వేశమేసిన రంగనాథ్ ను ప్రజలు కూడా నమ్మసాగారు. ఇలా విష్ణుమూర్తి వేషంలో వున్న రంగనాథ్ రోజురోజుకు పాపులర్ అయిపోయి ప్రజలు తండోపతండోలుగా రావడం ప్రారంభమయ్యింది. దీంతో అతడి నివాసంవద్ద వాహనాల రద్దీ పెరిగిపోయి ట్రాఫిక్ సమస్య ప్రారంభమయ్యింది. ఈ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు వెళ్ళడంతో ఈ దొంగబాబా గుట్టు రట్టయ్యింది. 

Read More చేతబడి అనుమానం : భార్యాభర్తలను చెట్టుకు వేలాడదీసి, కొట్టిన గ్రామస్తులు..

విష్ణుమూర్తి వేషంలో వున్న రంగనాథ్ ను గుర్తించిన పోలీసులు అతడో మోసగాడని ప్రజలను తెలిపారు. గతంలోనూ ఇలాగే మోసాలకు పాల్పడితే పట్టుకుని కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేసామని... అయినా అతడిలో మార్పు రాలేదని అన్నారు. ఇలాంటివారిని నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు మహబూబ్ నగర్ పోలీసులు. 

తాము ఇంతకాలం పూజించింది... కష్టాలు తీర్చడానికి వచ్చింది ఆ దేవుడేనని నమ్మింది ఓ దొంగను అని తెలిసి భక్తులు బాధపడుతున్నారు. భక్తి ముసుగులో ఇలా ప్రజలు సెంటిమెంట్స్ తో ఆడుకుంటున్న దొంగబాాబాలను కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.