నకిలీ సర్టిఫికెట్ల బాగోతం మరో మలుపు తిరిగింది. దీని తీగలాగితే డొంక కదిలినట్టుగా.. ఏడేళ్ల క్రితమే ఈ కేసులో ఇద్దరు అరెస్టైనట్టు తెలుస్తోంది. అయితే అప్పట్లో పూర్తిగా విచారణ జరపకపోవడం వల్లే టీఎస్‌ఎంసీ డేటా టాంపరింగ్ జరగడానికి దారి తీసిందని తెలుస్తోంది. వివరాల్లోకి వెడితే.....

హైదరాబాద్ : Telangana State Medical Council (టీఎస్‌ఎంసీ) డేటాబేస్ టాంపరింగ్ చేసి, అనర్హులను రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీ చేసిన కేసు దర్యాప్తును సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో కౌన్సిల్ సీనియర్ అసిస్టెంట్ అనంత కుమార్ తో సహా ముగ్గురు నిందితులను గత గురువారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరో అనుమానితురాలిగా ఉన్న nagamani 2015లోనే అరెస్ట్ అయినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.

విజయవాడకు భూక్యా నాగమణి, విజయనగరానికి చెందిన గంట రాంబాబు సన్నిహితులు. వీరిద్దరూ కలిసి 2015లో Duplicate MBBS Certificateతో పాటు ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ పత్రాన్ని డీటీపీలో రూపొందించారు. గుంటూరు జిల్లా నిజాంపట్నంకు చెందిన చెన్ను నాగమణి 2012లో ఏపీ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ చేయించుకున్నారు. ఈమెకు చెందిన 65699 నెంబర్ నే వినియోగించి వీరిద్దరూ Fake Certificates రూపొందించారు. వీటి ఆధారంగా నాగమణి నగరానికి చెందిన రమేష్ ద్వారా అదిలాబాద్ జిల్లా చెన్నూరులో ఉన్నలక్ష్మీ నర్సింగ్ హోమ్ లో గైనకాలజిస్ట్ గా చేరారు.

తన విద్యార్హత పత్రాల్లో ఎంబీబీఎస్, ఎమ్మెస్ (ఓబీజీ) అంటూ పొందుపరచడంతో ఆస్పత్రి యాజమాన్యం ఉద్యోగం ఇచ్చింది. ఈమె వ్యవహార శైలి, రాస్తున్న మందులు చూసిన సదరు హాస్పిటల్ పరిపాలనాధిపతి సుభాష్ అనుమానించారు. తన సందేహం నివృత్తి చేయాల్సిందిగా కోరుతూ మెడికల్ కౌన్సిల్ కు లేఖ రాశారు. పూర్వాపరాలు పరిశీలించిన కౌన్సిల్ నాగమణి నకిలీ వైద్యురాలని తేల్చడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా సుభాష్ కు సూచించింది. దీంతో ఆయన చెన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు

ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగమణితో పాటు రాంబాబును 2015 ఆగస్టు 22న అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉంది. ఇంత వరకు బాగానే ఉన్నా ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేయడంలో చెన్నూరు పోలీసులు విఫలమయ్యారు. నాగమణి, రాంబాబు కలిసినకిలీ సర్టిఫికెట్ల తయారు చేశారని తేల్చారు. ఉమ్మడి రాష్ట్రంలోని ఏపీ మెడికల్ కౌన్సిల్ నిజాంపట్నంకు చెందిన నాగమణి రిజిస్టర్ చేసుకున్నారని, ఆమె రిజిస్ట్రేషన్ నెంబర్ 65699 అని వీరికి ఎలా తెలిసింది అనేది ఆరా తీయలేదు. ఇప్పుడు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

ఇదిలా ఉండగా, ఫిబ్రవరిలో హైదరాబాద్ లో నకిలీ సర్టిఫికెట్ల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు నగరంలోని మలక్‌పేటలో అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసినట్టుగా హైద్రాబాద్ సీపీ CV Anand చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక్కో డిగ్రీకి ఒక్కో రేటు చొప్పున వసూలు చేస్తున్నారని సీవీ ఆనంద్ చెప్పారు. నకిలీ సర్టిఫికెట్స్ కొనుగోలు చేసిన ఏడుగురు విద్యార్థులను కూడా అరెస్ట్ చేసినట్టుగా సీవీ ఆనంద్ తెలిపారు. తల్లిదండ్రులకు తెలిసే విద్యార్ధులు నకిలీ సర్టిఫికెట్లు కొనుగోలు చేశారని సీపీ వివరించారు. 

ఈ నకిలీ సర్టిఫికెట్ల స్కాంపై దర్యాప్తు చేసేందుకు గాను SIT ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీపీ ఆనంద్ తెలిపారు. మలక్‌పేటలో శ్రీసాయి ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సంస్థలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారని సీపీ సీవీ ఆనంద్ చెప్పారు. నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న 10 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశామన్నారు.నకిలీ సర్టిఫికెట్లతో ఉన్నత విద్యా వ్యవస్థ నాశనం అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.