బాబా అవతారమెత్తిన బీటెక్ గ్రాడ్యుయేట్: భారీగా ఆశ్రమం... దొంగ పూజలతో కోట్లల్లో సంపాదన

నల్గొండ జిల్లాలో ఓ దొంగ బాబా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బీటెక్ చదివిన సదరు నిందితుడు స్వామిజీ అవతారమెత్తి ప్రజలను భారీగా దోచుకున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. 

fake baba arrested in nalgonda ksp

మనుషుల బలహీనతలు, అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు దొంగ బాబాలు అందినకాడికి దోచుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా మోసాలు రోజుకొకటి  వెలుగుచూస్తున్నాయి. అయినప్పటికీ కొందరు ప్రజలు మాత్రం మారడం లేదు. తాజాగా బీటెక్ చదివిన ఓ వ్యక్తి బతకడం కోసం దొంగ బాబా అవతారమెత్తాడు. 

అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు ఏ సమస్యలతో బాధపడుతున్నా సరే.. అమావాస్య, పున్నమికి వస్తే ప్రత్యేక పూజలు చేసి మీ సమస్యలు తీరుస్తా.. అని నమ్మబలికాడు. అయితే ఓ మహిళ ఫిర్యాదుతో దొంగ బాబా లీలలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లాకు చెందిన సాయి విశ్వ చైతన్య హైదరాబాదులో పుట్టి పెరిగాడు. అక్కడే బీటెక్‌ వరకు చదివాడు. అనంతరం విశ్వ చైతన్య పేరిట యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో పీఏపల్లి మండలంలోని అజ్మాపురంలో పది ఎకరాల విస్తీర్ణంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. సాయిబాబా ప్రవచనాలు చెబుతూ, తాయత్తులు కడుతూ, హోమాలు చేస్తూ రూ. కోట్లు వసూలు చేశాడు.

అయితే ఇటీవల తన సమస్యను తొలగిస్తానని సాయి విశ్వ చైతన్య నమ్మించి డబ్బులు తీసుకుని మోసగించాడని ఓ బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్పీ రంగనాథ్‌ ప్రత్యేక పోలీస్‌ బృందాన్ని నియమించారు. ఆశ్రమంలో ఉన్న సాయి విశ్వ చైతన్యను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సమయంలో భారీగా నగదు, బంగారు ఆభరణాలు, విలువైన డిపాజిట్‌ బాండ్లు, లాప్‌టాప్‌లు, ప్రవచన పుస్తకాలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గత ఆరు నెలలుగా బురిడీ బాబా.. సాయిబాబా భక్తునిగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు పోలీసులు..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios