Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ దూకుడు: ఏపీలో టీడీపీకి, తెలంగాణలో కాంగ్రెస్‌కు చుక్కలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ వ్యూహత్మకంగా వ్యవహరిస్తోంది.వచ్చే ఎన్నికల నాటికి రెండు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కమల దళం కసరత్తు చేస్తోంది

Eyeing power by 2024, BJP shifts gears in Telangana, AP
Author
Hyderabad, First Published Jul 23, 2020, 6:44 PM IST

అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ వ్యూహత్మకంగా వ్యవహరిస్తోంది.వచ్చే ఎన్నికల నాటికి రెండు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కమల దళం కసరత్తు చేస్తోంది. ఒకవేళ జమిలి ఎన్నికలు జరిగితే ఈ రెండు రాష్ట్రాల్లో మెరుగైన ఫలితాలను సాధించాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. రెండు రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీలను వెనక్కి నెట్టేందుకు బీజేపీ దూకుడుతో ముందుకు వెళ్తోంది.

2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి నాలుగు ఎంపీ స్థానాలు దక్కాయి. ఈ ఫలితాలు ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపాయి. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. అయితే గతంతో పోలిస్తే ఫలితాల్లో మెరుగుదల కన్పించింది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలపై బీజేపీ కన్నేసింది. 

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గణనీయమైన స్థానాలను దక్కించుకోవాలని ఆ పార్టీ వ్యూహాలను రచిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీ నుండి పెద్ద ఎత్తున బీజేపీలో నేతలు చేరుతారనే ప్రచారం సాగింది. కానీ అది ప్రచారం మాత్రమేనని తేలింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొందరు నేతలు బీజేపీలో చేరారు.

 తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం మారింది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పార్టీ పగ్గాలు చేపట్టాడు. సంజయ్ పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దూకుడుగా వెళ్తున్నాడు. సంజయ్ కు పార్టీ బాధ్యతలు రావడం వెనుక ఆర్ఎస్ఎస్ కీలకంగా వ్యవహరించిందనే ప్రచారం కూడ లేకపోలేదు.

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై బీజేపీ నాయకత్వం ఆందోళనలు నిర్వహిస్తోంది.విద్యుత్ బిల్లులు, పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్థ్యంపెంపు తదితర అంశాలపై బీజేపీ నాయకత్వం కార్యక్రమాలను నిర్వహిస్తోంది.కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై  కూడ బీజేపీ తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టింది. 

ఇక ఏపీ రాష్ట్రంలో కూడ బీజేపీ దూకుడుగానే ముందుకు వెళ్తోంది. గత ఏడాది జనసేనతో బీజేపీ జత కట్టింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ప్రకటించాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడ కలిసి పోటీ చేసేందుకు సిద్దమయ్యాయి. అయితే కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. 

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న నిర్ణయాలపై బీజేపీ తీవ్రంగా విమర్శలు గుప్పిస్తోంది. రాజధాని తరలింపు నిర్ణయంతో పాటు పలు అంశాలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కరోనా టెస్టుల కిట్స్ కొనుగోలులో అవినీతి చోటు చేసుకొందని బీజేపీ ఏపీ  అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు.ఈ విషయమై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడ స్పందించారు. ట్వీట్ల యుద్దం సాగింది.

మరోవైపు టీడీపీ నుండి బీజేపీలో చేరిన ఎంపీలను ఉద్దేశించి విజయసాయి చేసిన వ్యాఖ్యలపై కన్నా లక్ష్మీనారాయణతో పాటు బీజేపీ నేతలు స్పందించారు. బీజేపీ ఏపీ ఇంచార్జీ సునీల్ ధియోదర్ ఈ విషయంలో ఘాటుగా స్పందించారు. టీడీపీయే కాదు ఏ పార్టీయైనా కాషాయం చేయగలమని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం సృష్టించాయి.

ఏడాది కాలం పూర్తి చేసుకొన్న వైసీపీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పినంత మాత్రానా ఆ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం చేసిన తప్పులను సమర్ధించినట్టు కాదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఏపీలో పార్టీ కార్యకర్తల సమావేశంలో వ్యాఖ్యానించారు.

టీడీపీకి చెందిన కొందరు నేతలపై బీజేపీ నాయకత్వం గురి పెట్టినట్టుగా ప్రచారం సాగుతోంది.ఇప్పటికే కొందరు నేతలు బీజేపీలో చేరారు. మరికొందరితో ఆ పార్టీ నాయకత్వం టచ్ లో ఉందనే ప్రచారం కూడ సాగుతోంది. బీజేపీలో చేరినంత మాత్రానా కేసులు ఇతరత్రా  వాటి నుండి తప్పించుకోవచ్చనేది భ్రమేనని బీజేపీ నాయకత్వం స్పష్టం చేస్తోంది. 

ఏపీ రాష్ట్రంలో సినీ నటుడు పవన్ కళ్యాణ్ తో జత కట్టడం ద్వారా తమకు ప్రయోజనం కలిగే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది. 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారం చేపట్టాలని ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ అధికారాన్ని చేపట్టకపోయినా ప్రధాన ప్రతిపక్షంగా ఉండేలా ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది.

ఏపీలో ప్రధాన ప్రతిపక్షం  టీడీపీ కంటే ప్రతి విషయంలో బీజేపీ దూకుడుగా వెళ్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీ ముందుకు వెళ్తోంది.  రెండు రాష్ట్రాల్లో బీజేపీ నాయకత్వం ప్రధాన ప్రతిపక్షాల కంటే దూకుడుగా వెళ్తోంది. 

బీజేపీ దూకుడు ఈ రెండు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రతిపక్షపార్టీలను రాజకీయంగా ఇరుకున పెడుతోంది. కమల దళం స్పీడ్ ను అందుకొనేందుకు టీడీపీ, కాంగ్రెస్ లు ప్రయత్నిస్తున్నాయి.

ఏపీ రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాలు, తెలంగాణలో 19 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ కు 29 శాతం, టీడీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయి. తెలంగాణలో బీజేపీ తన ఓటు బ్యాంకును 7 నుండి 20 శాతానికి పెంచుకొంది. 

తెలంగాణలో టీడీపీకి చెందిన క్యాడర్ ఇప్పటికే కొంత రేవంత్ రెడ్డి వెంట కాంగ్రెస్ లో చేరింది. మరికొందరు బీజేపీలో చేరారు. ఎన్నికలకు ముందే చాలా మంది టీఆర్ఎస్ తీర్థంపుచ్చుకొన్నారు.తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం, ఆంధ్రప్రదేశ్ లో కమ్మ, కాపు సామాజిక వర్గాలపై బీజేపీ కన్నేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios