సికింద్రాబాద్ బోయిగూడలోని టింబర్ డిపోలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షి స్టేట్‌మెంట్ పోలీసులకు కీలకం మారింది. అతని ఫిర్యాదుతో డిపో యజమాని సంపత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ ( secunderabad bhoiguda fire accident) బోయిగూడ అగ్నిప్రమాదానికి సంబంధించి పోలీసులకు కీలక సాక్ష్యం దొరికింది. ప్రాణాలతో బయటపడ్డ ప్రేమ్ కుమార్ (prem kumar) అనే కార్మికుడు పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చాడు. స్క్రాప్ గోదాం యజమాని నిర్లక్ష్యంతోనే ప్రమాదం చోటు చేసుకుందని ప్రేమ్‌కుమార్ స్పష్టం చేశాడు. రెండేళ్లుగా తాను గోదాంలోనే పనిచేస్తున్నానని.. తనతో పాటు 11 మంది గోదాం మొదటి ఫ్లోర్‌లోనే పడుకున్నామని ఆయన పేర్కొన్నాడు. ఒక చిన్న రూమ్‌లో తనతో పాటు బిట్టు, పంకజ్ ఇద్దరూ వున్నారని చెప్పాడు. మరో పెద్ద రూమ్‌లో మిగిలిన తొమ్మిది మంది పడుకున్నారని ప్రేమ్ కుమార్ వెల్లడించాడు. రాత్రి 3 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు వచ్చాయని చెప్పాడు.
బయటికి వెళ్లేందుకు ప్రయత్నించామని.. కానీ మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయని ప్రేమ్ కుమార్ పేర్కొన్నాడు. నేను ఎలాగోలా కిటికీలోంచి బయటకు దూకానని చెప్పాడు. నాకు గాంధీ ఆసుపత్రిలో (gandhi hospital) చికిత్స అందించారని .. మిగతా వారంతా మంటల్లో చిక్కుకుపోయారు ప్రేమ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారని.. అప్పటికే మా వాళ్లంతా సజీవ దహనమయ్యారని ఆయన చెప్పాడు. ఈ క్రమంలో బోయిగూడ అగ్నిప్రమాదంలో స్క్రాప్ గోదాం ఓనర్ సంపత్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రేమ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో 304ఏ, 337 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కాగా.. ఇవాళ(బుధవారం) తెల్లవారుజామున సికింద్రాబాద్ బోయిగూడలోని స్క్రాప్ గోడౌన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల దాటికి గోడౌన్ లోని సిలిండర్ పేలడంతో మంటలు మరింత ఉదృతమయ్యాయి. మంటలు వేగంగా టింబర్ డిపో, స్క్రాప్ గోడౌన్ మొత్తాన్ని వ్యాపించడంతో అందులో నిద్రిస్తున్న కార్మికులకు తప్పించుకోడానికి వీలులేకుండా పోయింది. మొత్తం 15 మందిలో ఇద్దరు సురక్షితంగా బయటపడగా మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. మిగతా 11మంది మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.
గోడౌన్ కింది భాగంలో ఉన్న రూమ్ లో ముగ్గురు ఉంటారు. పై భాగంలో మిగిలినవారు ఉంటారు. పై భాగంలో ఉన్న వారు కిందికి రావాలంటే గోడౌన్ మధ్యలో ఉన్న ఇనుప మెట్ల నుండి కిందకు రావాల్సి ఉంటుంది. అయితే మంటలు తీవ్రంగా వ్యాప్తి చెందిన కారణంగా ఇనుప మెట్ల నుండి ఫై ఫ్లోర్ లో చిక్కుకున్న కార్మికులు కిందకు రాలేకపోయారు. అంతేకాదు ఈ గోడౌన్ కు బయటకు వెళ్లేందుక మరో దారి కూడా లేదు. దీంతో పై ఫ్లోర్‌లో ఉన్న కార్మికులు కిందకు రాలేకపోయినట్టుగా పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారు బిట్టు, సికిందర్, దామోదర్, సత్యేంతర్, చింటు, దినేష్, రాజేష్, రాజు, దీపక్, పంకజ్ లుగా గుర్తించారు. మృతులంంతా బీహార్ రాష్ట్రానికి చెందినవారే. వీరి మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం బిహార్ కు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
