వివాహేతర సంబంధం రెండు నిండుప్రాణాలను బలితీసుకుంది. తమ వివాహేతర సంబంధం గురించి బయటకు పొక్కడంతో సమాజంలో నిందలను భరించలేమనుకోని బలవన్మరణానికి పాల్పడ్డారు. వారు ఆత్మహత్యకు పాల్పడ్డ 27 రోజుల తరువాత ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకి వెళితే... కోటిపల్లికి చెందిన మహేందర్(38) మేస్త్రి పని చేసుకుంటూ ధారూరులో నివాసముండేవాడు. అతడికి పనిచేసే చోట శివనీల(36) అనే కూలితో పరిచయం ఏర్పడింది. అలా వారి పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. 

కొన్నాళ్లపాటు వీరి వ్యవహారం గుట్టుగానే సాగింది. కానీ ఆ విషయం ఎంతోకాలం మాత్రం దాగలేదు. ఆ విషయం బయటపడడంతో మహేందర్ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. శివనీల ఇంట్లో కూడా ఈ విషయం తెలియడంతో వారిరువురు కలిసి ఎవ్వరికి చెప్పకుండా పారిపోయారు. 

ఈ విషయం తెలియని ఇరు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. ఇద్దరి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు వారు అనంతగిరి అడవుల్లో ఉన్నట్టు గుర్తించారు. ఆ తరువాత వారి సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. 

పోలీసులు ఆ రోజు నుంచి వారికోసం గాలిస్తూనే ఉన్నారు. ఇలా పోలీసులు కూడా వెదుకుతూ ఉండగానే నిన్న శనివారం రోజున పశువుల కాపరులకు ఈ రెండు శవాలు కనిపించాయి. దానితోవారు పోలీసులకు సమాచారం అందించారు. 

అక్కడ సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు ఏప్రిల్ 5వ తేదీన మహేందర్, శివనీల ఇద్దరు అక్కడకు వచ్చి చీరతో చెట్టుకి ఉరి వేసుకొని మరణించారని నిర్ధారణకు వచ్చారు. శవాలు పూర్తిగా కుళ్లిపోయి కేవలం అస్థిపంజరాలుగా మాత్రమే మిగలడంతో పోలీసులు ఆ శవాలను అక్కడ ఉన్న బండి నెంబర్ ఆధారంగా, సెల్ ఫోన్ల ఆధారంగా గుర్తించారు. 

అనంతరం ఘటనా స్థలంలోనే శవాలకు పోస్ట్ మార్టం నిర్వహించారు. వారి అక్రమ సంబంధం విషయం బయటకు పొక్కడంతో సమాజంలో తలెత్తుకు జీవించలేమని, సమాజం తమ మీద వేసే నిందలు భరించలేమని భావించి వీరు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.