నిజామాబాద్: తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కోపంతో ఓ మహిళ తన భర్తను హత్య చేసి, శవాన్ని మంజీరనదిలో పాతిపెట్టింది. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం మందార్న గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. భర్తను హత్య చేసిన తర్వాత శవాన్ని మంజీర ఇసుకలో పాతిపెట్టి దాచేసింది. 

మందార్నకు చెందిన గంగామణికి సాయిరాంతో కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. వారికి ఆరేళ్ల వయసు గల పాప కూడా ఉంది. గత కొంత కాలంగా గంగామణికి అదే గ్రామానికి చెందిన సుభాష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం నడుస్తోంది. దాంతో ఆమెను భర్త నిలదీశాడు. అంతేకాకుండా మద్యం సేవించి మత్తులో ఆమెను కొడుతూ వస్తున్నాడు. 

అతనితో విసిగిపోయిన భార్య హత్యకు పథకం రచించింది. శుక్రవారంనాడు భర్త సాయిరాం తప్పతాగి ఇంటికి వచ్చాడు. ఆమె ప్రియుడు సుభాష్, తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు సాయిరాంను కొట్టి చంపారు. అనుమానం రాకుండా శవాన్ని మంజీర నదిలో పాతిపెట్టారు. మూడు రోజులుగా భర్త కనిపించడం లేదని గంగామణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

పోలీసుల విచారణలో అసలు సంగతి బయటపడింది. వివాహేతర సంబంధం కారణంగానే సాయిరాంను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని సోమవారం వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.