వివాహేతర సంబంధం : తోటి కానిస్టేబుల్ దంపతుల దాడిలో గాయపడిన సిసిఎస్ సీఐ ఇఫ్తేకార్ అహ్మద్ మృతి..
తోటి కానిస్టేబుల్ దంపతుల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు సిసిఎస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇఫ్తేకార్ అహ్మద్. మెదడులో రక్తం గడ్డ కట్టి, పరిస్థితి విషమించింది.
మహబూబ్ నగర్ : వివాహేతర సంబంధం నేపథ్యంలో తోటి కానిస్టేబుల్ దాడిలో తీవ్ర గాయాల పాలైన మహబూబ్ నగర్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిఐ మంగళవారం తుది శ్వాస విడిచాడు. ఆరు రోజులుగా ఇఫ్తే కార్ అహ్మద్ మృత్యువుతో పోరాడాడు. అతను హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గత ఆరు రోజులుగా చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే…
మహబూబ్నగర్ లోని మర్లు - పాలకొండ రోడ్డులో గత గురువారం ఉదయం ఇఫ్తేకార్ అహ్మద్ తన కారులో తీవ్రమైన గాయాలతో కనిపించారు. అతనికి తల, ఇతర శరీర భాగాల్లో బలమైన గాయాలయ్యాయి. అది గమనించిన వారు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. మహబూబ్నగర్ ఆసుపత్రిలో ప్రధమ చికిత్స తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాదుకు తరలించారు.
వివాహేతర సంబంధం : సిసిఎస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మర్మాంగాలు కోసిన కానిస్టేబుల్...
ఆయన పరిస్థితి మొదటి నుంచి విషమంగానే ఉంది. మెదడులో రక్తం గడ్డ కట్టింది. ఇక్కడి వైద్యులు ఆయనకు ఆపరేషన్ చేసి చెడు రక్తాన్ని తొలగించారు. అయినా, ప్రయోజనం లేకుండా పోయిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మహబూబ్నగర్ డిఎస్పి మహేష్ గ్రామీణ సిఐ స్వామి మృతదేహాన్ని శవపంచనామా కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఇఫ్తేకార్ అహ్మద్ మృతి కేసును హత్య కేసుగా మార్చారు. ఈ కేసులో ఒక కానిస్టేబుల్ దంపతులను నిందితులుగా భావిస్తున్నారు. ఆయన దాడి తర్వాత వారు కూడా కనిపించడం లేదు. వారి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను నియమించి గాలిస్తున్నారు. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడు ఒకరు పోలీసులు అదుపులో ఉన్నట్లుగా సమాచారం. కాగా సిసిఎస్ సీఐపై దాడి కారులో జరిగిందా? మహిళా కానిస్టేబుల్ ఇంట్లో జరిగిందా? అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.