మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరలో భాగంగా వనదేవతలు గద్దె మీదకు చేరడంతో వారిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం వనదేవతలను దర్శించుకున్నారు.

వీఐపీగా రావాల్సిన ఆయన ఓ సాధారణ భక్తుడిలా క్యూ లైన్‌లో నిలబడి, గోడ దూకి ఆయన సమ్మక్క గద్దెను దర్శించుకున్నారు. అనంతరం కడియం మాట్లాడుతూ.. అమ్మవార్ల ఆశీర్వాదంతోనే తెలంగాణ సిద్ధించిందని అభిప్రాయపడ్డారు.

Also Read:మేడారం జాతర: వన దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన కేసీఆర్

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడు సార్లు మేడారం జాతర జరిగిందని.. ఇందుకోసం సీఎం కేసీఆర్ మొత్తం రూ.315 కోట్లు కేటాయించారని శ్రీహరి గుర్తుచేశారు. మేడారం జాతరను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగగా గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కాగా శుక్రవారం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ మేడారంను సందర్శించారు. ఈ సందర్భంగా వనదేవతలను దర్శిచుకోవడం ఆనందంగా ఉందన్నారు గవర్నర్. 

Also Read:గద్దెపైకి చేరుకున్న సమ్మక్క, పోటెత్తిన భక్తులు

గురువారం సాయంత్రం సమ్మక్క తల్లిని పూజారులు చిలకలగుట్ట నుంచి గద్దె మీదకు తీసుకొచ్చారు. అమ్మవారి రాకకు గౌరవ సూచకంగా జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ నేతృత్వంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. గిరిజన పూజారుల ప్రత్యేక పూజల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.