Asianet News TeluguAsianet News Telugu

సోమేశ్ వీఆర్ఎస్‌కు కేంద్రం ఓకే.. బీఆర్ఎస్‌లో చేరుతారంటూ ప్రచారం, మాజీ సీఎస్ నెక్ట్స్ స్టెప్ ఏంటో..?

తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)కు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఆమోదముద్ర వేసింది. సోమేశ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నారని మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. 

ex telangana cs somesh kumar vrs approved by dopt ksp
Author
First Published Apr 27, 2023, 2:26 PM IST

తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)కు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు ఆయన చేసుకున్న దరఖాస్తును పరిశీలించి అంగీకారం తెలిపింది. 

ఇక, సోమేశ్ కుమార్ 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఏపీలో పలు బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత గిరిజిన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. 2019 డిసెంబర్ 31న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎక్కువ కాలం పనిచేసిన సీఎస్‌గా ఉన్నారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌ విభజన సందర్భంగా తన సీనియారిటీ ప్రకారం తాను ఆప్షన్‌ ఇచ్చిన తెలంగాణకు కాకుండా ఏపీకి కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ సోమేశ్‌ కుమార్‌ 2014లో సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌(క్యాట్‌)ను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తెలంగాణలోనే కొనసాగేలా క్యాట్‌  తీర్పు ఇచ్చింది.  అయితే క్యాట్ ఆర్డర్‌ను నిలిపివేయాలని కోరుతూ డీవోపీటీ 2016 మార్చిలో తెలంగాణ హైకోర్టులో రిట్ అప్పీల్ దాఖలు చేసింది. డీవోపీటీ దాఖలు చేసిన రిట్ అప్పీల్‌ను విచారించిన చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్ నందాతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. 

ALso Read: మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ సంచలన నిర్ణయం.. వీఆర్ఎస్‌కు దరఖాస్తు, కారణమిదేనా...?

సోమేశ్ కుమార్‌ను తెలంగాణ కేడర్‌కు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వును తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. కేటాయింపు జాబితాలో జోక్యం చేసుకోవడం ద్వారా క్యాట్ తప్పు చేసిందని అభిప్రాయాన్ని కలిగి ఉన్నామని ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు తీర్పు వెలువడిని కొన్ని గంటలకు.. సోమేష్‌ కుమా‌ర్‌ను తెలంగాణ నుంచి రిలీవ్ చేసి.. జనవరి 12లోగా ఏపీలో రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీచేసింది. అయితే హైకోర్టు తీర్పు నేపథ్యంలో .. సోమేశ్ కుమార్ గత నెలలో ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేశారు. అయితే వీఆర్‌ఎస్‌పై వెళ్లాలనే తన ఆలోచనను ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేసిన రోజే సీఎం జగన్‌కు సోమేశ్ కుమార్ తెలిపినట్టుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమేశ్‌ వ్యక్తిగత అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఎలాంటి పదవిని కేటాయించలేదని తెలుస్తోంది.  

ఇక, తన వీఆర్‌ఎస్‌ను అనుమతించాలని కోరుతూ సోమేశ్‌ కుమార్‌ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  కేఎస్‌ జవహర్‌ రెడ్డికి దరఖాస్తు పంపారు. ఇందుకు సీఎం జగన్ ఆమోదముద్ర వేశారు. వాస్తవానికి సోమేశ్ కుమార్‌కు ఈ ఏడాది డిసెంబర్‌ వరకూ సర్వీస్‌లో కొనసాగే అవకాశముంది. ఇక, సవరించిన నిబంధల ప్రకారం.. కేంద్రం అనుమతి తీసుకోకుండానే ఏదైనా ఆల్ ఇండియా సర్వీస్ అధికారి వీఆర్ఎస్ దరఖాస్తులను క్లియర్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఆ తర్వాత కేంద్రానికి కూడా తన వీఆర్ఎస్ దరఖాస్తును పంపారు సోమేశ్ కుమార్. ఈ క్రమంలోనే డీవోపీటీ ఆమోదముద్ర వేసింది. 

మరోవైపు.. సోమేశ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నారని మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. ఆయన చేరికకు కేసీఆర్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. పలు రాష్ట్రాల్లో జరిగే బీఆర్ఎస్ సమావేశాల్లో సోమేశ్ పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఔరంగాబాద్‌లో కేసీఆర్ నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగసభలో సోమేశ్ కుమార్ ప్రత్యక్షం కావడంతో ఈ కథనాలకు బలం చేకూరుస్తోంది. మరి సోమేశ్ బీఆర్ఎస్‌లో చేరుతారా లేక ఇవన్నీ గాలివార్తలేనా అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. 


 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios