తెలంగాణ బీజేపీకి మరో షాక్ తగిలే అవకాశాలున్నాయి. మాజీ ఎంపీ వివేక్ కమలం పార్టీ వీడి గులాబీ కండువా కప్పుకోబోతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. వివేక్ ఆశిస్తున్న ధర్మపురి నుంచి టికెట్ ఇవ్వడానికి బీఆర్ఎస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
అసెంబ్లీ ఎన్నికల ముంగిట తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య జంపింగ్‌లు పెరుగుతున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వత తెలంగాణలో రాజకీయ ముఖచిత్ర వేగంగా మారుతున్నది. కాంగ్రెస్ బలపడటం, అనూహ్యంగా బీజేపీ బలహీనపడటంతో ఈ పార్టీ నేతలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. తాజాగా, పెద్దపల్లి మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ పార్టీ మారనున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
కాంగ్రెస టికెట్ పై ఎంపీగా గెలిచిన ఆయన కొద్ది రోజుల తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ నాయకత్వంపై అసంతృప్తితో బీజేపీ గూటికి చేరారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గంలో కీలక నేతగా ఉన్నారు. తెలంగాణలో కాక కొడుకుగా, మాజీ ఎంపీగా, మీడియా అధిపతిగా, బిజినెస్‌మ్యాన్‌గా వివేక్‌కు ప్రత్యేక గుర్తింపు ఉన్నది.
బీజేపీలో వివేక్‌కు ఈటల మధ్య విభేదాలు పలుమార్లు బయటపడ్డాయి. వివేక్‌ను ఉద్దేశించి ఈటల రాజేందర చేసిన వ్యాఖ్యలు పార్టీలోనూ కలకలం రేపాయి. వీరిద్దరికి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. తాజాగా, బీజేపీ అధిష్టానం చేసిన భారీ మార్పుల్లో రాష్ట్ర అధ్యక్షుడు మారడమే కాదు.. ఈటల రాజేందర్‌కు కీలకమైన ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ పదవి దక్కడం వివేక్‌లో అసంతృప్తిని మరింత రాజేసినట్టు తెలుస్తున్నది.
కొంతకాలంగా వివేక్ పార్టీ వ్యవహారాల్లో అంటీముట్టనట్లుగానే నడుచుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా పాల్గొనడం లేదు. ఈటలకు పదవి దక్కడంతో ఆయన ప్రత్యామ్నాయ మార్గాన్ని చూస్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే ఆయన బీఆర్ఎస్‌తో టచ్‌లోకి వెళ్లినట్టు సమాచారం. కేరళ పర్యటనలో ఉన్న వివేక్ తిరిగి రాగానే గులాబీ గూటికి చేరుతారనే వార్తలు వినవస్తున్నాయి.
Also Read: వచ్చే ఎన్నికల్లో జనసేన బలమైన ముద్ర: పవన్ కళ్యాణ్.. రేపు ‘వారాహి’ యాత్ర రెండో విడత ప్రారంభం
అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నుంచి పోటీ చేయాలని వివేక్ ఆలోచిస్తున్నారు. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ నేతల ముందూ పెట్టినట్టు తెలిసింది. స్థానం నుంచి ఎమ్మెల్యేగా ప్రస్తుత మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉన్నారు. అయితే, ఆయనకు వేరే స్థానం కేటాయించి ధర్మపురి టికెట్ వివేక్ కు ఇచ్చే సర్దుబాటుకు బీఆర్ఎస్ ఓకే అని చెప్పినట్టు సమాచారం.
తొలుత కాంగ్రెస్ నుంచి కూడా వివేక్‌ను పార్టీలోకి తీసుకునే ప్రయత్నాలు జరిగినట్టు తెలిసింది. కానీ, బీఆర్ఎస్ నుంచి డీల్ కుదరడంతో హస్తం పార్టీ డోర్లు వేసి.. బీఆర్ఎస్ వైపు వెళ్లేందుకు వివేక్ సుముఖంగా ఉన్నట్టు సమాచారం. మరి కొన్ని రోజుల్లోనే ఈ వ్యవహారం ఓ స్పష్టత కు రానుంది.
