పవన్ కళ్యాణ్ రెండో విడత వారాహి యాత్ర రేపు ప్రారంభం కానుంది. ఏలూరు నుంచి రేపు ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది. వారాహి యాత్ర కోసం పడిన కష్టం వృథా పోదని, అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన స్పష్టమైన ముద్ర వేస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు.
Varahi Yatra: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీలు యాత్రలు చేపడుతున్నాయి. ఒక వైపు నారా లోకేశ్, మరో వైపు పవన్ కళ్యాణ్ ప్రజల్లో తిరుగుతున్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ తొలి దశ వారాహి యాత్ర విజయవంతంగా ముగించిన సంగతి తెలిసిందే. రెండో దశ వారాహి యాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మొదటి విడత వారాహి యాత్ర పై సమీక్ష నిర్వహించారు. వారాహి యాత్ర కమిటీలతో పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వారాహి యాత్ర కోసం చేసిన కృషి, పడిన కష్టం వృథా కాబోదని ఆయన అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన బలమైన ముద్ర వేస్తుందని చెప్పడం గమనార్హం. తొలి దశ వారాహి యాత్ర ఉభయ గోదావరి జిల్లాల కేంద్రంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ.. ప్రజాకంటక పాలన విముక్తి గోదావరి జిల్లా నుంచే ప్రారంభం అవుతుందని చెప్పారు.
Also Read: 13న ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకోనున్న పురంధేశ్వరి.. భారీ ర్యాలీకి ప్లాన్
రెండో విడత వారాహి యాత్రను కూడా మొదటి దానిలాగే విజయవంతం చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అదే పట్టుదలతో సక్సెస్‌ఫుల్ చేయాలని కోరారు. జనసేన ఎంత బలంగా ముందుకు వెళ్లితే రాష్ట్రానికి అంత మేలు జరుగుతుందని వివరించారు.
రేపటి నుంచే రెండో విడత వారాహి యాత్ర ప్రారంభం కానుంది. ఈ నెల 9వ తేదీన వారాహి యాత్ర ఏలూరులో ప్రారంభం అవుతుంది. రేపు సాయంత్రం 5 గంటలకు ఏలూరులో బహిరంగ సభ నిర్వహిస్తారు. మరుసటి రోజు ఏలూరులో మధ్యాహ్నం జనవాణి నిర్వహించనున్నారు. 11వ తేదీన దెందులూరులో ముఖ్యనేతలు, వీర మహిళలతో భేటీ, 12వ తేదీ సాయంత్రం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. వారాహి యాత్రపై జనసేనాని పవన్ కళ్యాణ్ గంపెడు ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తున్నది. దాని ప్రభావం ఏమిటో అసెంబ్లీ ఫలితాల తర్వాతే తెలియనుంది.
