ప్రజల చెవుల్లో పూలు పెట్టే మాటలొద్దు.. ముందు పాత రూ.1000 కోట్లు ఇవ్వండి : కేసీఆర్‌పై పొంగులేటి ఫైర్
గత వరదల సమయంలో ప్రకటించిన రూ.1000 కోట్లను ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టే మాటలు మానాలని శ్రీనివాస్ రెడ్డి హితవు పలికారు.

9 ఏళ్లలో చేయని అభివృద్ధిని సీఎం కేసీఆర్ ఈ మూడు నెలల్లో చేస్తారా అని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. శనివారం ఖమ్మం జిల్లా బొక్కలగడ్డలో భారీ వర్షాలు, వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను ఆయన పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ముంపు ప్రాంతాల ప్రజలకు ఆయన నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. గత వరదల సమయంలో ప్రకటించిన రూ.1000 కోట్లను ఇవ్వాలని కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. 35 ఏళ్ల క్రితం వచ్చిన వరదలు ఇప్పుడు మళ్లీ వచ్చాయని.. కరకట్ట ఇస్తా, ఇళ్లు కట్టిస్తానని కేసీఆర్ చెప్పారని ఆయన పొంగులేటి ఎద్దేవా చేశారు.
ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టే మాటలు మానాలని శ్రీనివాస్ రెడ్డి హితవు పలికారు. కరకట్ట అంటే ఏంటో, కాంక్రీట్ అంటే ఎంటో నీకు తెలుసా అంటూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై శ్రీనివాస్ రెడ్డి సెటైర్లు వేశారు. ఇల్లు మునిగిన ప్రతి కుటుంబానికి పాతిక వేలు, వరదల్లో మరణించిన కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని పొంగులేటి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మున్నేరు పరివాహక ప్రాంతంలో కరకట్ట నిర్మిస్తామని శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఇకపోతే.. గత శుక్రవారం వైరాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో గ్రూపుల వారీగా తన్నుకుంటారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భట్టి విక్రమార్క, రేణుక చౌదరిలతో కలిసి పనిచేస్తామని పొంగులేటి స్పష్టం చేశారు. జిల్లాలో పదికి పది సీట్లు గెలుచుకుంటామని శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తామని.. మోసపూరితమైన ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలని ప్రజలు తహతహలాడుతున్నారని పొంగులేటి అన్నారు. అధికారమదంతో విర్రవీగుతున్న ప్రజా ప్రతినిధులను ఇంటికి పరిమితం చేయాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో 25 నుంచి 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎందుకు మార్చాలని అనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైందని.. కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా అది ఇంకా 55 రోజుల మాత్రమేనని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో వర్గాల పేరుతో రోడ్డెక్కొద్దని ఆయన హితవు పలికారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్ని కాంక్రీట్ గోడలు కట్టినా, జిత్తులు వేసినా, వేల కోట్లు ఖర్చు పెట్టినా కాంగ్రెస్ పార్టీ వ్యక్తే సీఎం అవుతారని పొంగులేటి జోస్యం చెప్పారు.