వర్గాల పేరుతో రోడ్డెక్కొద్దు .. 55 రోజులు ఓపికపడితే, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం : పొంగులేటి వ్యాఖ్యలు
బీఆర్ఎస్ పార్టీ ఎన్ని కాంక్రీట్ గోడలు కట్టినా, జిత్తులు వేసినా, వేల కోట్లు ఖర్చు పెట్టినా కాంగ్రెస్ పార్టీ వ్యక్తే సీఎం అవుతారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో 25 నుంచి 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎందుకు మార్చాలని అనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు.

మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం వైరాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో గ్రూపుల వారీగా తన్నుకుంటారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భట్టి విక్రమార్క, రేణుక చౌదరిలతో కలిసి పనిచేస్తామని పొంగులేటి స్పష్టం చేశారు. జిల్లాలో పదికి పది సీట్లు గెలుచుకుంటామని శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తామని.. మోసపూరితమైన ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలని ప్రజలు తహతహలాడుతున్నారని పొంగులేటి అన్నారు. అధికారమదంతో విర్రవీగుతున్న ప్రజా ప్రతినిధులను ఇంటికి పరిమితం చేయాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.
ALso Read: ఎస్ఆర్ గార్డెన్స్ లో అధికారుల సర్వే, మార్కింగ్: పొంగులేటి అనుచరుల ఆందోళన
బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో 25 నుంచి 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎందుకు మార్చాలని అనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైందని.. కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా అది ఇంకా 55 రోజుల మాత్రమేనని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో వర్గాల పేరుతో రోడ్డెక్కొద్దని ఆయన హితవు పలికారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్ని కాంక్రీట్ గోడలు కట్టినా, జిత్తులు వేసినా, వేల కోట్లు ఖర్చు పెట్టినా కాంగ్రెస్ పార్టీ వ్యక్తే సీఎం అవుతారని పొంగులేటి జోస్యం చెప్పారు.