చంద్రబాబు విడుదల కావాలంటూ టీటీడీపీ నిరసన.. బల్కంపేట ఎల్లమ్మకు కాట్రగడ్డ ప్రసూన బోనం
చంద్రబాబు నాయుడు విడుదల కావాలని కోరుకుంటూ హైదరాబాద్‌లో సెట్లర్స్ ఫోరం తరపున బల్కంపేట ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించారు మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను ఖండిస్తూ తెలుగు రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు సాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అక్రమ అరెస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు విడుదల కావాలని కోరుకుంటూ హైదరాబాద్‌లో సెట్లర్స్ ఫోరం తరపున బల్కంపేట ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించారు మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన. ఈ కార్యక్రమానికి చంద్రబాబు అభిమానులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.
ఇకపోతే.. చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ వేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఈ పిటిషన్ పై విచారణను ఏసీబీ కోర్టు ఈ నెల19కి వాయిదా వేసింది. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. గత శనివారం అరెస్టైన చంద్రబాబు వారం రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన అరెస్ట్ పై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం చెలరేగింది. ఆయనకు ఈ కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదలు పిటిషన్ సమర్పించారు. కాగా దీని విచారణ శుక్రవారం వాయిదా పడింది.