సారాంశం

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రేపు కాంగ్రెస్ పార్టీలో చేరున్నారు. శనివారం సోనియా గాంధీ, రాహుల్ గాంధీల సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. 

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రేపు కాంగ్రెస్ పార్టీలో చేరున్నారు. శనివారం సోనియా గాంధీ, రాహుల్ గాంధీల సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. నిజానికి సెప్టెంబర్ 17న తుమ్మల కాంగ్రెస్‌లో చేరుతారని వార్తలు వచ్చాయి. అయితే రేపే ఆయన హస్తం తీర్ధం పుచ్చుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

ఇవాళ హైదరాబాద్‌లోని తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో కాంగ్రెస్ నేతలు మాణిక్‌రావు థాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరు కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా తుమ్మలను ఆహ్వానించారు. 17వ తేదీన జరిగే సభలో కాంగ్రెస్‌లో చేరాలని థాక్రే కోరగా.. దీనికి తుమ్మల సానుకూలంగా స్పందించినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పలు దఫాలుగా ఇప్పటికే తుమ్మలను కలిశారు కాంగ్రెస్ నేతలు. అయితే కాంగ్రెస్‌లో చేరే దానిపై నాగేశ్వరావు క్లారిటీ ఇవ్వలేదు. 

ఈ ఏడాది ఆగస్టు  21న  కేసీఆర్ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో  తుమ్మల నాగేశ్వరరావుకు  టిక్కెట్టు దక్కలేదు. పాలేరు నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా  పోటీ చేయాలని తుమ్మల నాగేశ్వరరావు భావించారు. అయితే  పాలేరు నుండి సిట్టింగ్  ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికే  బీఆర్ఎస్ టిక్కెట్టు దక్కింది.  దీంతో తుమ్మల నాగేశ్వరరావు  కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని  10 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన  తన అనుచరులుతో  తుమ్మల నాగేశ్వరరావు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రజా క్షేత్రంలో ఉండాలని తన అనుచరులకు  తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. అయితే  వచ్చే ఎన్నికల్లో  పాలేరు అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దిగుతానని  తుమ్మల నాగేశ్వరరావు తన అనుచరులకు తేల్చి చెప్పారు. ఈ మేరకు  రంగం సిద్దం  చేసుకుంటున్నారు.