Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ వ్యూహం .. కాంగ్రెస్‌లోకి మండవ వెంకటేశ్వరరావు , ఆ టికెట్ ఆయనకేనా..?

బీఆర్ఎస్ నేత , మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఇంటికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించనున్నారు రేవంత్. ఆయన గనుక కాంగ్రెస్‌లో చేరితే నిజామాబాద్ రూరల్ టికెట్ ఇస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 
 

ex minister mandava venkateswara rao is likely to join congress ksp
Author
First Published Oct 15, 2023, 6:51 PM IST

బీఆర్ఎస్ నేత , మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఇంటికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించనున్నారు రేవంత్. ఇవాళ, లేదా రేపు మండవ వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌లోకి చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఆయన గనుక కాంగ్రెస్‌లో చేరితే నిజామాబాద్ రూరల్ టికెట్ ఇస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఇకపోతే.. టీడీపీలో సీనియర్ నేతగా వున్న మండవ వెంకటేశ్వరరావు 2019 ఉగాది పర్వదినాన సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. నిజామాబాద్‌ జిల్లాలో కీలక నేతగా ఉన్న మండవ వెంకటేశ్వరరావు డిచ్‌పల్లి, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం అభ్యర్ధిగా పోటీ చేసి పలుమార్లు గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 

2009 నుంచి మండవ వెంకటేశ్వరరావు పోటీకి దూరంగా ఉంటున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని భావించారు. అయితే పొత్తులో భాగంగా ఆ టికెట్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. దీంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అదే ఏడాది తెలంగాణ సీఎం కేసీఆర్ జూబ్లీహిల్స్ లోని మండవ వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లి సుమారు గంటన్నరపాటు చర్చించారు. అనంతరం పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు. కేసీఆర్ తో సమావేశమైన అనంతరం మండవ వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీలో చేరతానని ప్రకటించారు. ప్రకటించిన 24 గంటలలోపే ఆయన కారెక్కేశారు. 

వాస్తవానికి 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో బీఆర్ఎస్ వీక్‌గా వుందని గ్రహించిన కేసీఆర్ తన కుమార్తె కోసం పాత మిత్రుడు మండవ ఇంటికెళ్లారు. టీడీపీలో వుండగా వీరిద్దరూ సన్నిహితంగా మెలిగేవారు. ఈ క్రమంలోనే మిత్రుడి కోరిక మేరకు మండవ వెంకటేశ్వరరావు గులాబీ కండువా కప్పుకున్నారు. అయినప్పటికీ కవిత ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత మండవను కేసీఆర్ పట్టించుకోలేదు.

వెంకటేశ్వరరావు సైతం తన పని తాను చేసుకుంటూ మీడియాకు, రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. అయినప్పటికీ నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో మండవకు ఇప్పటికీ పట్టుంది. ఆ ప్రాంతంలో స్థిరపడిన సెటిలర్స్‌తో ఆయనకు మంచి అనుబంధం వుంది. ఈ నేపథ్యంలో మండవ వెంకటేశ్వరరావును ఎలాగైనా పార్టీలోకి తీసుకురావాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios