తెలంగాణలో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో రాజకీయం వేడెక్కింది. తెలంగాణ బీజేపీలో ఓ వైపు చేరికల జోష్ కొనసాగుతుండగా.. మరోవైపు కొందరు నేతలు పార్టీకి దూరం అవుతున్నారు.

తెలంగాణలో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో రాజకీయం వేడెక్కింది. పార్టీ అధిష్టానాల పట్ల అసంతృప్తితో ఉన్న నాయకులు ఇతర పార్టీల్లో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. శ్రావణ మాసం కావడంతో మంచి ముహుర్తాలు చూసుకుని ఫిరాయింపు బాట పడుతున్నారు. మరోవైపు పార్టీ అధిష్టానాలు కూడా అసంతృప్తి ఉన్న నాయకులు చేజారిపోకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారుతుంది. 

అయితే తెలంగాణ బీజేపీలో కూడా ఓ వైపు చేరికల జోష్ కొనసాగుతుండగా.. మరోవైపు కొందరు నేతలు పార్టీకి దూరం అవుతున్నారు. బీజేపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన పార్టీ ఉపాధ్యక్షుడు యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో పాటు మరికొంత మంది నాయకులు త్వరలో కాంగ్రెస్‌లోకి చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. మరోవైపు మాజీ మంత్రి జె చిత్తరంజన్ దాస్‌ తన మద్దతుదారులతో కలిసి బీజేపీ గూటికి చేరేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఉన్న చిత్తరంజన్ దాస్‌తో ఒక ప్రముఖ నాయకుడు చర్చలు జరిపారని.. బీజేపీ తరఫున జడ్చర్ల అసెంబ్లీ సీటును ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే ఈ పరిణామాలను చిత్తరంజన్ దాస్ వర్గం కూడా ధ్రువీకరిస్తోంది. 

చిత్తరంజన్ దాస్ విషయానికి వస్తే.. అది 1989 అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావును చిత్తరంజన్ 3,568 ఓట్లతో ఓడించి జాయింట్ కిల్లర్ అనే పేరు తెచ్చుకున్నారు. 1985 ఎన్నికల్లో కూడా కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చిత్తరంజన్ జనతా పార్టీ అభ్యర్థిపై విజయం సాధించారు. 

చిత్తరంజన్ దాస్.. మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో పర్యాటక, కార్మిక శాఖ మంత్రిగా.. ఎన్‌ జనార్దన్‌రెడ్డి ప్రభుత్వంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే 1994 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. 1999లో కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో టీడీపీలో చేరారు. ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్‌లో చేరి ఓబీసీ సెల్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 2009 ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి పీఆర్పీ టికెట్‌పై పోటీ చేసిన చిత్తరంజన్ మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లి విధేయతను మార్చుకున్నారు.

2018లో కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో 2019లో సార్వత్రిక ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈసారి కల్వకుర్తి రేసులో అడుగుపెట్టాలని ఆయన ఆశించారు. అయితే బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా జైపాల్ యాదవ్‌కు తదుపరి టికెట్ కేటాయించారు. దీంతో చిత్తరంజన్ ‌దాస్ పార్టీ మారేందుకు సిద్దమయ్యారు. 

ఇక, ఈటల రాజేందర్ మద్దతుదారునిగా పేరొందిన ఏనుగు రవీందర్‌రెడ్డి పార్టీ మారేందుకు సిద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు రవీందర్‌రెడ్డి దూరంగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే, బీజేపీలో మాజీ మంత్రి కృష్ణ యాదవ్‌ చేరికపై గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇటీవల బీజేపీలో చేరేందుకు కృష్ణ యాదవ్ సిద్దమవ్వగా.. చివరి నిమిషంలో ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు అందుబాటులో లేకుండాపోయారు. దీంతో ఈ చేరికను ఆయన వాయిదా వేశారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే ఎం ధర్మారావు నేతృత్వంలో బీజేపీ క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేసింది.