2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పై గజ్వేల్ నుంచి పోటీ చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఇప్పటికే అక్కడ పని ప్రారంభించానని ఆయన తెలిపారు. 

జాతీయ కార్యవర్గ సమావేశాలు, ప్రధాని మోడీ సభతో తెలంగాణలో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో (bjp) టీఆర్ఎస్, బీజేపీ (trs) నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (etela rajender) ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి తాను సీఎం కేసీఆర్ పై (kcr) పోటీ చేస్తానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇప్పటికే ఫోకస్ పెట్టానన్న ఈటల.. తాను టీఆర్ఎస్ లో చేరింది ఇక్కడి నుంచే అని గుర్తుచేశారు. రాష్ట్రంలో కేసీఆర్ ను ఓడించాల్సిన అవసరం వుందని.. బెంగాల్ లో సువేంద్ అధికారి చేసిన పని తెలంగాణలోనూ రీపిట్ అవుతుందని రాజేందర్ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్ ను మరింత వేగవంతం చేస్తామని.. రాబోయే రోజుల్లో బీజేపీలోకి పెద్ద ఎత్తున చేరికలు వుంటాయని ఈటల రాజేందర్ చెప్పారు. 

కాగా.. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (mamata banerjee) తన పార్టీ తృణమూల్ కాంగ్రెసుకు తిరుగులేని విజయం సాధించి పెట్టారు. అయితే, తాను పోటీ చేసిన నందిగ్రామ్ లో సమీప బిజెపి ప్రత్యర్థి సువేందు అధికారిపై (suvendu adhikari) ఓటమి పాలయ్యారు. తనకు అత్యంత సన్నిహితుడుగా ఉంటూ వచ్చిన సువేందు అధికారి బిజెపిలో చేరి నందిగ్రామ్ నుంచి పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. దీంతో ఆయనపై పోటీ చేసి సువేందును ధీటుగా ఎదుర్కున్నారు. ఏళ్ల తరబడిగా సువేందు అధికారి నందిగ్రామ్ కు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. చివరకు సువేందు అధికారి 1736 ఓట్ల తేడాతో మమతాపై విజయం సాధించారు.

ALso REad:రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించిన బీజేపీ.. కేడర్‌కు మూడు రోజుల శిక్షణ

మరోవైపు.. జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన మరుసటి రోజే మూడు కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రకటన చేశారు. మూడు కమిటీల విషయానికి వస్తే.. చేరికలపై సమన్వయ కమిటీ, ఫైనాన్స్ కమిటీ, టీఆర్‌ఎస్ వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయన కమిటీలు ఉన్నాయి. ఈ కమిటీల్లో మాజీ మంత్రి, హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. గతేడాది టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరిన ఈటలకు.. ఇతర రాజకీయ పార్టీల నేతలు బీజేపీలో చేరడాన్ని పర్యవేక్షించే బృందానికి కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ కమిటీలో ఆదివారం బీజేపీలో చేరిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి కూడా చోటు కల్పించారు. ఈటల రాజేందర్ నేతృత్వంలోని చేరికలపై సమన్వయ కమిటీలో.. కొండా విశ్వేశ్వర్​రెడ్డి, డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, కె లక్ష్మణ్, గరికపాటి మోహన్ రావు, ఎ చంద్రశేఖర్, దుగ్యాల ప్రదీప్ కుమార్‌లు ఉన్నారు. 

ఇదివరకు చేరికల కమిటీకి చైర్మన్​గా ఇంద్రసేనారెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజులుగా బీజేపీ ఇతర పార్టీలకు చెందిన నాయకులు వారి పార్టీలో చేర్చుకోవడానికి తీవ్ర కసరత్తు చేస్తుంది. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌లో అసంతృప్తులతో, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన నేతలను టార్గెట్‌గా చేసుకుని మంతనాలు సాగిస్తుంది. ఈ తరుణంలో ఇంద్రసేనా రెడ్డి చేరికల కమిటీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో.. ఆ కమిటీకి నేతృత్వం వహించే బాధ్యతలను ఈటల రాజేందర్‌కు అప్పగించింది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించడంతో పాటుగా, టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఈటల బాధ్యతలు నిర్వహించారు. ఇలా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఈటల రాజేందర్.. ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారని పార్టీ నాయకత్వం భావిస్తుంది. 

ALso Read:అరుణాచల్ ప్రదేశ్ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో బీజేపీకే మెజారిటీ.. 130 స్థానాల్లో 102 ఏక‌గ్రీవం

ఫైనాన్స్‌ కమిటీ కన్వీనర్‌గా మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఈ కమిటీలో గరికపాటి మోహన్‌రావు, చాడ సురేష్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, పార్టీ కోశాధికారి శాంతి కుమార్, యోగానంద్‌ సభ్యులుగా ఉన్నారు. ఇక, టీఆర్​ఎస్​ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై అధ్యయన కమిటీకి కన్వీనర్‌గా ఎంపీ ధర్మపురి అరవింద్‌ను నియమించారు. ఈ కమిటీలో వివేక్ వెంకటస్వామి, రఘునందన్ రావు, స్వామి గౌడ్, డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి, బాబీ అజ్మీరాలు సభ్యులుగా ఉన్నారు.