Asianet News TeluguAsianet News Telugu

ఈ నెల 7 న టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తా.. ఎర్రబెల్లి ప్రదీప్ రావు

ఎర్రబెల్లి ప్రదీప్ రావు టీఆర్ఎస్ పార్టీకి ఈ ఏడున రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఆయనను పార్టీ వీడకుండా చేసిన బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. 

Errabelli Pradeep Rao resign from TRS party on 7th, Warangal
Author
Hyderabad, First Published Aug 4, 2022, 8:12 AM IST

వరంగల్ : వరంగల్ లో టీఆర్ఎస్ కు మరో దెబ్బ తగలనుంది. టిఆర్ఎస్ పార్టీకి ఈనెల 7వ తేదీన రాజీనామా చేయనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ప్రకటించారు. టిఆర్ఎస్ ను నమ్ముకుంటే నట్టేట మునిగినట్టేనని, అందుకే ఆ పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. బుధవారం వరంగల్ ఓసిటీలోని తన నివాసంలో బుధవారం ఆయన వరంగల్ తూర్పు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అనుచరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో ఎన్ని అవమానాలు జరిగినా ఓపికతో భరించామని, చివరికి తనను నమ్ముకున్న కార్యకర్తలపై పోలీసు కేసులు పెట్టించే పరిస్థితులు వచ్చాయని,  ఇంత జరుగుతున్నా అధిష్టానం నుంచి స్పందన లేదు అన్నారు.

ఇన్నేళ్లుగా పార్టీలో పనిచేస్తున్నా... న్యాయం జరగలేదని.. కనీస గుర్తింపు లేదని.. ఈ పరిణామాలను భరించడం ఇంక తనవల్ల  అవ్వడం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.  తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించానని, తాను స్వయంగా ఏర్పాటుచేసిన తెలంగాణ నవ నిర్మాణ సమితి పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేశామని ప్రదీప్ రావు గుర్తు చేసుకున్నారు.  వరంగల్ తూర్పు టికెట్ ఇస్తామని చెప్పి రెండుసార్లు చేయిచ్చారని,  ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పి ఇవ్వలేదని ఆరోపించారు. ‘ఆదరించి, మంచి అవకాశాలు కల్పిస్తామని హామీ  ఇచ్చిన పార్టీలోనే చేరుదాం’ అని ప్రదీప్ రావు అన్నారు.

బుజ్జగింపులు: ఎర్రబెల్లి ప్రదీప్ రావుతో మాజీ మంత్రి బస్వరాజ్ సారయ్య భేటీ

ఫలించని బుజ్జగింపులు…
ప్రదీప్ రావు పార్టీని వీడుతున్నట్లు వార్తలు రావడంతో టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. ఎమ్మెల్సీ సారయ్య, రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ ను దూతలుగా ప్రదీప్ రావు వద్దకు పంపించారు. వారు ప్రదీప్ రావు నివాసానికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు. కెసిఆర్ మీతో మాట్లాడతారని ఫోన్ కలిపి ఇచ్చినా ఆయన మాట్లాడలేదని తెలిసింది. 

కాగా, ఎర్రబెల్లి ప్రదీప్ రావు  టిఆర్ఎస్ పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న క్రమంలో బుధవారం టిఆర్ఎస్ నాయకత్వం బుజ్జగింపులకు దిగింది. పార్టీ వీడాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తన అనుచరులతో ప్రదీప్ రావు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రదీప్ రావు పార్టీని వీడవద్దని టిఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారంనాడు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ప్రదీప్ రావుతో భేటీ అయ్యారు. ప్రదీప్ రావు ఎమ్మెల్సీ పదవిని ఆశించారు. 

మంత్రి దయాకర్ రావు ఇంట్లో కలకలం.. టీఆర్ఎస్‌ను వీడే యోచనలో ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్ రావు..?

ఎమ్మెల్సీ కోటా లేదా గవర్నర్ కోటాలో ప్రదీప్ రావు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని అనుకున్నారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకత్వం ఇతరులకు ఎమ్మెల్సీ పదవిని కేటాయించింది. దీంతో ఇక టిఆర్ఎస్ లో తనకు న్యాయం జరగదన్న అభిప్రాయంతో ఆయన ఉన్నారని అనుచరులు చెబుతున్నారు. అయితే ప్రదీప్ రావు టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరతారని ప్రచారం కొనసాగుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios