మెడికల్ సీట్ల స్కాంలో దర్యాప్తు ముమ్మరం: మల్లారెడ్డి సహా పలు కాలేజీలకు నోటీసులివ్వనున్న ఈడీ
మెడికల్ కాలేజీ స్కాంలో పలు మెడికల్ కాలేజీలకు ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు.
హైదరాబాద్: మెడికల్ కాలేజీల్లో సీట్ల స్కాంపై ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేయనున్నారు.2016 నుండి 2022 వరకు మెడికల్ కాలేజీల్లో ఆడ్మిషన్ల విషయంలో స్కాం జరిగిందని అందిన ఫిర్యాదు మేరకు ఈడీ అధికారులు గత మాసంలో రాష్ట్రంలోని పలు మెడికల్ కాలేజీల్లో సోదాలు నిర్వహించారు. కీలకమైన పత్రాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలోని ఆరు మెడికల్ కాలేజీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ ఏడాది జూన్ 21న మెడికల్ కాలేజీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
హైద్రాబాద్ సూరారంలోని మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మహాబూబ్ నగర్ లోని ఎస్‌వీఎస్ మెడికల్ కాలేజీ, సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ , శామీర్ పేటలోని మెడిసిటీ కాలేజీ, చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీల్లో ఈడీ సోదాలు నిర్వహించింది.
ప్రైవేట్ మెడికల్ కాలేజీల నిర్వాహకులు పీజీ సీట్లను ముందస్తు ప్రణాళిక ప్రకారం బ్లాక్ చేసి భారీ మొత్తానికి విక్రయించారని కాళోజీ మెడికల్ యూనివర్శిటీ అధికారులు 2022 ఏప్రిల్ లో వరంగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగా ఈడీ అధికారులు రంగంలోకి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. మెడికల్ కాలేజీ సీట్ల స్కాంలో రూ. 100 కోట్లు చేతులు మారినట్టుగా ప్రచారం సాగుతుంది.
ఈ విషయమై మంత్రి మల్లారెడ్డికి చెందిన కాలేజీ బాధ్యులకు ఈడీ నోటీసులు ఇవ్వనుంది. ఈ కాలేజీతో పాటు పలు కాలేజీలకు ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.