లోన్ యాప్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. హైదరాబాద్‌లోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో లోన్ యాప్స్ దారుణాలకు సంబంధించి 100కు పైగా కేసులు నమోదయ్యాయి. వీటిపై దర్యాప్తును వేగవంతం చేయాలని ఈడీ నిర్ణయం తీసుకుంది.
లోన్ యాప్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. హైదరాబాద్‌లోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో లోన్ యాప్స్ దారుణాలకు సంబంధించి 100కు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో చైనీస్ పౌరులు, కంపెనీలు ఎక్కువగా నిర్వహించే లోన్ యాప్ మోసాలపై వేగవంతంగా దర్యాప్తు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ద్వారా నమోదైన మరో 100 లోన్ యాప్ మోసం కేసులను చేపట్టాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిర్ణయించింది.
హైదరాబాద్ పోలీసులు గత కొన్ని నెలల్లో దాదాపు 100 లోన్ యాప్ మోసాలు, వేధింపుల కేసులను నమోదు చేశారు. సైబరాబాద్, రాచకొండ పోలీసుల్లో కూడా ఇలాంటి కేసులు నమోదయ్యాయి. రుణం తీసుకున్న మహిళలు.. నగ్నంగా ఉన్నట్టుగా మార్ఫింగ్ చేసిన చిత్రాలు, వీడియోలతో వేధించిన సందర్భాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తీవ్రంగా పరిగణించందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటువంటి నేరాలకు పాల్పడుతున్న బోగస్ సంస్థలపై చర్యలు తీసుకోనేందుకు ఈడీ సిద్దమైందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
లోన్ యాప్ మోసాలకు సంబంధించి ఈడీకి దాదాపు 45 కేసులకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లు వచ్చాయని.. మరికొన్ని కేసుల వివరాల కోసం ఎదురుచూస్తున్నట్టుగా ఈడీ వర్గాలు తెలిపాయని టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది. వివిధ లోన్ యాప్ కేసుల్లో నిందితులుగా కనీసం 10 మంది చైనీస్ పౌరుల.. ఈడీ, సీసీఎస్ అధికారులు వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నారు. చైనా పౌరులు పట్టుబడితేనే విచారణలో మరింత పురోగతి ఉంటుందని అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక, లింక్‌యున్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, డోకీపే టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ వంటి చైనీయులు నిర్వహిస్తున్న మోసపూరిత లోన్ యాప్ కంపెనీలపై మనీలాండరింగ్ కేసును ఈడీ ఇప్పటికే విచారిస్తుంది. ఈడీ విచారణలో అంతర్జాతీయ హవాలా లావాదేవీలు, ఇతర అక్రమ కార్యకలాపాలు వెలుగుచూశాయి. చైనా కంపెనీలతో ముడిపడి ఉన్న షెల్ కంపెనీల ఖాతాల్లో రూ. 50 కోట్లను ఈడీ సీజ్ చేసింది.
Dokypayకి రూ. 1,268 కోట్ల కలెక్షన్లతో పాటు.. మరో రూ. 120 కోట్ల విదేశీ రెమిటెన్స్‌లు ఉన్నాయని కూడా ఈడీ గుర్తించింది. ఈ కంపెనీలకు లింక్ చేసిన పేమెంట్ గేట్‌వేలు, బ్యాంక్ ఖాతాల ద్వారా రూ. 21,000 కోట్ల విలువైన 1.4 కోట్ల లావాదేవీలు ఇప్పటివరకు కనుగొన్నారు.
